జల వివాదాల్లో సమన్వయం పాటించండి
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు జైరాం సూచన
శాంతిభద్రతల్లో సీఎంను భాగస్వామిని చేస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగించాలని, సమన్వయంతో రెండు రాష్ట్రాలు ప్రగతి సాధించాలని కేంద్ర మంత్రి జైరాం రమేశ్ తెలంగాణ ప్రాంత మంత్రులకు ఉద్బోధించారు. ప్రాంతాలుగా విడిపోయినా తెలుగు ప్రజలుగా కలసే ఉండాలని ఆకాంక్షించారు. చిన్నచిన్న తగాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. ముఖ్యంగా నదీజలాల విషయంలో రాష్ట్రాల మధ్య సమన్వయం మిక్కిలి అవసరమని, ఇరు ప్రాంతాలు ఈ విషయంలో నదీ జలాల బోర్డులకు సహకారం అందించాలని కోరారు. శనివారం మధ్యాహ్నం తెలంగాణ ప్రాంత కా్రంగెస్ మంత్రులు జానారెడ్డి, సునీతారెడ్డి, గీతారెడ్డి, ప్రసాద్‌కుమార్, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్‌బాబు, ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, రాజయ్య, విప్ ఆరేపల్లి మోహన్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జైరాంను ఆయన నివాసంలో కలిసి తెలంగాణ ఏర్పాటుకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జైరాం పలు కీ లక సూచనలు నేతలకు చేసినట్లు తెలిసింది. ఆయన చెప్పిన అంశాలు..
కొత్తగా ఏర్పడే రాష్ట్రంతో సమన్వయం అవసరం. రెండు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు ఉంటాయి. వాటిని ఓపికతో పరిష్కరించుకోండి.
నదీ జలాల సమస్యలను పెద్దవి చేయకుండా సమన్వయంతో వ్యవహరించండి.
తెలంగాణలోని సీమాంధ్రులకు ఎలాంటి అభద్రత ఉండదని భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది.
హైదరాబాద్‌లో శాంతిభద్రతల అంశాన్ని మేమూ పరిశీలిస్తున్నాం. ఆ అధికారాల్ని పూర్తిగా గవర్నర్‌కే కట్టబెట్టకుండా తెలంగాణ సీఎంకు, అక్కడి ప్రభుత్వానికి తగిన భాగస్వామ్యం కల్పిస్తాం.