
టెలిగ్రాం ఖరీదు.. రూ. 15 లక్షలు!
ఒక్క టెలిగ్రాం లక్షల ఖరీదు ఎలా ఉంటుందని అనుకుంటున్నారా? జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్కు ఆయన సహాయకుడు పంపిన అలనాటి టెలిగ్రాంను వేలం వేస్తే.. ఇంత వస్తుందని భావిస్తున్నారు. అది కూడా అలాంటి ఇలాంటి సమయంలో కాదు.. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో పంపిన టెలిగ్రామట. నాజీల రహస్య పోలీసు విభాగమైన జెస్టాపో వ్యవస్థాపకుడు హెర్మన్ గోరింగ్.. తమ అధినేత హిట్లర్కు 1945 ఏప్రిల్ 23వ తేదీన ఈ టెలిగ్రాం పంపాడు.
థర్డ్ రీచ్ నాయకత్వం చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈ సందేశం పంపారు. అయితే ఇది హిట్లర్కు కోపం తెప్పించడంతో ఆయనను తప్పించి, అడ్మిరల్ కార్ల్ డోయింట్జ్ను తన వారసుడిగా ప్రకటించారు. ''చాలా పెద్ద నేరం చేశావు'' అంటూ టెలిగ్రాంకు హిట్లర్ సమాధానం కూడా పంపారు. హిట్లర్కు వెళ్లిన టెలిగ్రాంను రేపు అమెరికాలో వేలం వేస్తారు. దానికి సుమారు రూ. 15 లక్షల వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు.