
'పెళ్లిచూపుల'కు సూపర్ వసూళ్లు!
చెన్నై: అందమైన కథ. వినూత్న కథనం. చిన్న బడ్జెట్. పెద్ద విజయం. తాజాగా విడుదలై విజయాన్ని సాధించిన 'పెళ్లిచూపులు' సినిమా గురించి చెప్పుకోవాలంటే ఈ నాలుగు మాటలు సరిపోతాయేమో!
తెలుగునాట చక్కని ప్రేక్షకాదరణ పొందుతున్న ఈ సినిమా అమెరికాలోనూ కలెక్షన్లపరంగా గొప్ప మైలారాయిని దాటింది. అగ్రరాజ్యంలో మిలియన్ డాలర్లకుపైగా (రూ. 6.78 కోట్ల) వసూళ్లను రాబట్టింది. పెట్టుబడిపరంగా చూసుకుంటే నిర్మాతకు ఇది పెద్దమొత్తంలో లాభమని చెప్పొచ్చు.
'శనివారం నాటికి 'పెళ్లిచూపులు' మిలియన్ డాలర్ల క్లబ్బులో చేరింది. అమెరికాలో శనివారం 4.40 గంటల నాటికి 10,11,146 డాలర్ల (రూ. 6.78 కోట్ల)ను వసూలు చేసింది. ఇంకా వసూళ్లు కొనసాగుతున్నాయి. సూపర్బ్' అంటూ బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.
ఈ సినిమా అమెరికా హక్కులను రెండు లక్షల డాలర్లకు అమ్మినట్టు తెలుస్తోంది. పెట్టుబడిపరంగా చూసుకుంటే అమెరికాలో ఈ సినిమా అసాధారణమైన విజయాన్ని సొంతం చేసుకుందని, నిర్మాతకు గణనీయమైన లాభాలు సాధించిపెట్టిందని మరో ట్రేడ్ విశ్లేషకుడు త్రినాథ్ తెలిపారు. తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ 'పెళ్లిచూపులు'లో విజయ్ దేవరకొండ, రీతూవర్మ, ప్రియదర్శి పులికొండ ప్రధాన పాత్రల్లో నటించారు.