తమిళనాట సర్వత్రా ఉత్కంఠ!
- చెన్నై అపోలో ఆస్పత్రి వద్ద ఉద్వేగభరిత వాతావరణం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. వారం రోజులుగా ఆస్పత్రిలో ఉన్న జయలలిత ఆరోగ్యం గురించి వైద్యులు ఎలాంటి ప్రకటన చేయకపోవడం తమిళనాడులో ఉత్కంఠ రేపుతోంది. ఈ నేపథ్యంలో అమ్మ ఆరోగ్య పరిస్థితిపై రాజ్‌భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. జయలలితను పరామర్శించిన అనంతరం ఇన్‌చార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు నేరుగా రాజ్‌భవన్ వెళ్లి.. ఈ ప్రకటన విడుదల చేశారు. జయలలిత కోలుకుంటున్నదని ఆయన తెలిపారు. ఆమె సంపూర్ణంగా కోలుకోవాలని ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మరో రెండురోజులు చెన్నైలోనే ఉండనున్నారు.
అయితే, అభిమానులు, అన్నాడీఎంకే శ్రేణుల ఆందోళన దృష్ట్య చికిత్స పొందుతున్న జయలలిత ఫొటోలను విడుదల చేసే అవకాశముంది. జయ అనారోగ్యం నేపథ్యంలో చెన్నై అపోలో ఆస్పత్రికి తమిళనాడు మంత్రులు, అన్నాడీఎంకే నేతలు, శ్రేణులు పెద్దసంఖ్యలో చేరుకుంటున్నారు.
చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను తమిళనాడు ఇన్‌చార్జి గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు రాత్రి 7 గంటలకు పరామర్శించారు. గవర్నర్‌తోపాటు జయలలిత కేబినెట్ మంత్రులంతా ఆస్పత్రి చేరుకోవడంతో ఆస్పత్రి వద్ద ఉద్వేగపూరిత వాతావరణం నెలకొంది. 'అమ్మ' అని ఆత్మీయంగా పిలుచుకునే జయలలిత ఆరోగ్యంపై అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. ఆస్పత్రి వద్ద పెద్దస్థాయిలో పోలీసులను మోహరించారు. జయలలిత ఆరోగ్య పరిస్థితిపై గత రెండురోజులుగా వైద్యులు బులిటెన్ విడుదల చేయలేదని తెలుస్తోంది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యవర్గాలు ఏమీ చెప్పకపోవడం కూడా ఉత్కంఠ రేపుతోంది. జయలలిత ఆరోగ్య పరిస్థితిపై గవర్నర్ అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. జయలలితకు మెరుగైన చికిత్స అందజేసేందుకు విదేశాలకు తరలించే అవకాశముందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
గత వారం రోజులుగా ఆస్పత్రిలో ఉన్న అమ్మ (జయలలిత) ప్రస్తుతం కోలుకుంటున్నారని, ఇంగ్లండ్ నుంచి వచ్చిన ఓ ప్రత్యేక వైద్యుడి పర్యవేక్షణలో చెన్నైలో ఆమెకు చికిత్స అందిస్తున్నట్టు అన్నాడీఎంకే తెలిపిన సంగతి తెలిసిందే. జయలలిత తీవ్ర అస్వస్థతతో ఉన్నట్టు వచ్చిన వదంతులను ఆ పార్టీ తోసిపుచ్చింది.