యూకే వైద్యుడి పర్యవేక్షణలో అమ్మ.. ఫొటోలు ఇవ్వం!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అనారోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధికార పార్టీ స్పందించింది. గత వారం రోజులుగా ఆస్పత్రిలో ఉన్న అమ్మ (జయలలిత) ప్రస్తుతం కోలుకుంటున్నారని, ఇంగ్లండ్ నుంచి వచ్చిన ఓ ప్రత్యేక వైద్యుడి పర్యవేక్షణలో చెన్నైలో ఆమెకు చికిత్స అందిస్తున్నట్టు అన్నాడీఎంకే తెలిపింది. జయలలిత తీవ్ర అస్వస్థతతో ఉన్నట్టు వచ్చిన వదంతులను ఆ పార్టీ తోసిపుచ్చింది. జయలలిత ప్రస్తుత పరిస్థితిని తెలిపేందుకు ఫొటోలు విడుదల చేయాలన్న డిమాండ్‌ను తోసిపుచ్చింది.
‘అమ్మ కోలుకుంటున్నది. త్వరలోనే ఆమె డిశ్చార్జ్ అవుతారని భావిస్తున్నాం. జయలలిత ఫొటోలు విడుదల చేయాలన్న అవసరం లేదని భావిస్తున్నాం. మేం ప్రజలకు మాత్రమే జవాబుదారీ. ప్రతిపక్షాలకు కాదు’అని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి పన్రుతి ఎస్ రామచంద్రన్ శనివారం విలేకరులకు తెలిపారు. జయలలిత అనారోగ్యంపై ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని, ఆమె ప్రస్తుత ఫొటోలను విడుదల చేయాలని ప్రతిపక్ష డీఎంకే అధినేత ఎం కరుణానిధి డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని తమిళనాడు గవర్నర్ సీఎచ్ విద్యాసాగర్‌రావును ఆయన కోరారు.