ఆస్పత్రిలోనే అమ్మ!
మరికొన్నాళ్లు చికిత్స అవసరం
- జయలలిత ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి వర్గాల వివరణ
- తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలో అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు
- ఆస్పత్రిలో జయను పరామర్శించిన గవర్నర్ విద్యాసాగర్‌రావు
చెన్నై: పదిరోజులుగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు సీఎం జయలలిత (68) కోలుకుంటున్నారని అపోలో ఆస్పత్రి అన్నాడీఎంకే వర్గాలు వెల్లడించాయి. జ్వరం, డీ హైడ్రేషన్ సమస్యలతో సెప్టెంబర్ 22న ఆస్పత్రిలో చేరిన జయ ఆరోగ్యంపై ఆసుపత్రి వర్గాలు, పార్టీ కార్యాలయం ఏ ప్రకటన చేయకపోవటంతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. అయితే శనివారం సాయంత్రం జయను పరామర్శించిన తమిళనాడు ఇన్‌చార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు, వైద్యుల సంరక్షణలో ఆమె కోలుకుంటున్నారని తెలిపారు. ఆస్పత్రి యాజమాన్యం కూడా రెండ్రోజుల తర్వాత అమ్మ ఆరోగ్యంపై బులెటిన్ విడుదల చేసింది. ‘వైద్యుల చికిత్సకు సీఎం బాగానే స్పందిస్తున్నారు. అవసరమైన పరీక్షలు నిర్వహించాం.
కొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉంటే అన్నీ కుదురుకుంటాయి. త్వరలోనే జయ పూర్తిస్థాయిలో కోలుకుంటారు’ అని అపోలో సీవోవో సుబ్బయ్య విశ్వనాథన్ తెలిపారు. మరోవైపు, లండన్ నుంచి వచ్చిన ఇంటెన్సిటివ్ నిపుణుడు డాక్టర్ రిచర్డ్ జాన్ బేల్ నేతృత్వంలో వైద్యుల బృందం జయకు చికిత్సనందిస్తోంది.
సర్కారు అంతా ఆస్పత్రి వద్దే..: సీఎం ఆరోగ్య పరిస్థితిపై పుకార్లు వెల్లువెత్తటంతో ఆస్పత్రి వద్ద అన్నాడీఎంకే కార్యకర్తలతోపాటు అభిమానులు క్యూ కట్టారు. మంత్రులు, పార్టీ కీలక నేతలు, సీఎస్, డీజీపీ సహా ఉన్నతాధికారులంతా ఆస్పత్రి వద్దే ఉన్నారు. ఆస్పత్రి వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటుచేశారు.
ఆస్పత్రి నుంచే పాలన..: జయ వైద్యుల సంరక్షణలో కోలుకుంటున్నారని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి పి. వళరమతి తెలిపారు. ‘అమ్మ బాగానే ఉన్నారు. చికిత్స పొందుతూనే ఆస్పత్రి నుంచే పాలనను పర్యవేక్షిస్తున్నారు. ఈ నెలలో జరిగే స్థానిక ఎన్నికలకు పార్టీ అభ్యర్థులనూ ప్రకటించారు. కొందరు గిట్టనివారు అమ్మ ఆరోగ్యంపై అనవసరంగా పుకార్లు పుట్టిస్తున్నారు’ అని తెలిపారు. వారం రోజులుగా అపోలో ఆస్పత్రి నుంచే సర్కారు అధికారిక ప్రెస్‌నోట్లు విడుదలవుతున్నాయి. జయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే కావేరీ జలాలపై సుప్రీంకోర్టు తీర్పు వంటి అంశాలను గమనిస్తున్నట్లు తెలిసింది. డాక్టర్లు మాత్రం జయ పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయానికి చేరవేస్తున్నారు. అయితే జయను పరామర్శించి వచ్చిన నేతలు మాత్రం.. ఆమె కోలుకుంటున్నారని.. త్వరలోనే ఆరోగ్యంగా పోయెస్ గార్డెన్‌కు వస్తారని ప్రకటిస్తున్నారు. డాక్టర్లు సూచించినట్లుగా కాస్త విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని అన్నాడీఎంకే ప్రతినిధి రామచంద్రన్ తెలిపారు.
జయ కోలుకుంటున్నారు: గవర్నర్
జయలలితను ఇంచార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు పరామర్శించారు. జయ ఆరోగ్యంపై వదంతులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో గవర్నర్ పరామర్శించటం ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు 35 నిమిషాల సేపు ఆసుపత్రిలోనే ఉన్న గవర్నర్‌కు అపోలో గ్రూపు చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి.. ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న చికిత్సను వివరించారు. ‘జయలలిత కోలుకుంటున్నారు. ఆమెకు అందుతున్న వైద్య సేవల పట్ల సంతృప్తిగా ఉంది’ అని రాజ్‌భవన్ నుంచి విడుదలైన ప్రకటనలో గవర్నర్ విద్యాసాగర్ రావు పేర్కొన్నారు.
ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారా?
జయలలిత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే.. రాజకీయ సమస్యలు, కోర్టు కేసులు, మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆరోగ్యంపై దృష్టి పెట్టలేదని తెలుస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు జైలులో శిక్ష అనుభవిస్తున్నప్పుడూ జయ ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని తమిళనాడు సర్కారు కోర్టును కోరింది. చాలా కాలంగా అమ్మ మధుమేహం, రక్తపోటుతో బాధపడుతున్నట్లు తెలిసింది.
ఉదయం నుంచి టెన్షన్.. టెన్షన్
పదిరోజులుగా జయలలిత ఆస్పత్రిలో ఉన్నా.. శనివారం మాత్రం చెన్నైలో హైడ్రామా నడిచింది. శనివారం మధ్యాహ్నం నుంచి అమ్మను సందర్శించేందుకు ఆస్పత్రికి వీఐపీలు పెద్ద సంఖ్యలో రావటంతో అభిమానుల్లో ఆందోళన రెట్టింపైంది. దీంతోపాటు మీడియాలో రకరకాల వార్తలు రావటంతో ఆస్పత్రికి అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తల తాకిడి పెరిగింది. అమ్మ ఆరోగ్యంపై వదంతులను ప్రచారం చేస్తున్న పలువురిపై పోలీసులు కేసులు పెట్టారు. ఫ్రాన్స్‌లోని తమిళచ్చి అనే ఓ యువతి.. ఫేస్‌బుక్‌లో పెట్టిన అభ్యంతరకరమైన పోస్టుతో.. ఆమెపై సైబర్ క్రైమ్ కేసు నమోదైంది. జయ ఆరోగ్యంపై పదిరోజుల్లో 3 బులెటిన్లే విడుదలవటం, రెండ్రోజులుగా ఆస్పత్రి వర్గాలుఏమీ చెప్పకపోవటంతో అమ్మ అభిమానుల్లో ఆందోళన ఎక్కువైంది. దీంతో వేల సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు రేయింబవళ్లు ఆస్పత్రి వద్దే పడిగాపులు కాస్తున్నారు.