సర్జికల్ స్ట్రైక్స్ చేసినా.. వారు తగ్గడం లేదు!
ఉడి ఉగ్రఘటన అనంతరం తీవ్రవాదులను ఏరివేయడానికి నియంత్రణ రేఖ వెంబడి పాక్ భూభాగంలోకి చొచ్చుకుని వెళ్లి భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసిన సంగతి తెలిసిందే. భారత్ ఈ దాడులు చేసినప్పటికీ తీవ్రవాదులు భయపడటం లేదని మాజీ జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. తీవ్రవాదులను అణచివేయడానికి భారత ఆర్మీ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ విఫలమైనట్టు ఆయన వ్యాఖ్యానించారు. తీవ్రవాదులకు ఆశ్రయమిస్తున్న పాకిస్తాన్పై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోనుందో దేశ ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగ, నగ్రోటాలో నిన్న జరిగిన ఉగ్రదాడిలో ఒక మేజర్ సహా ఏడుగురు జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటనలో ఆరుగురు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది.
ఈ దాడిపై తీవ్రంగా స్పందించిన జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కేంద్రంపై మండిపడ్డారు. ''తీవ్రవాదుల బుల్లెట్లకు మన ఏడుగురు వీర జవాన్లు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్పై కేంద్రం అవలంభించే విధానాన్ని కచ్చితంగా వివరించాల్సినవసరం ఉంది'' అని ఒమ్మర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పటికీ, తీవ్రవాదులు తగ్గడం లేదని, మన జవాన్లను బలిగొంటూనే ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అంతర్జాతీయంగా పాకిస్తాన్ను ఏకాకిని చేయలేకపోయారని బీజేపీపై ఆయన ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా నగ్రోటా ఉగ్రదాడిలో చనిపోయిన ఆఫీసర్, జవాన్ల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.