
మంచితనానికి 'మెచ్చు'తునక!
టెక్సస్: ప్రపంచంలో మానవత్వం పూర్తిగా మాయమైపోలేదని నిరూపించాడో అమెరికా వ్యాపారి. తన దగ్గర పనిచేసే యువతి ప్రాణం కాపాడేందుకు రెస్టారెంట్ను అమ్మేశాడు. మైఖేల్ డీ బియెర్ 15 ఏళ్లుగా టెక్సస్లో కైసర్హొప్ రెస్టారెంట్ నడుపుతున్నాడు. ఇందులో పనిచేసే 19 ఏళ్ల బ్రిటానీ మాథిస్కు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్టు డిసెంబర్లో బయటపడింది. పింగ్-పాంగ్ బాల్ సైజులో ట్యూమర్ ఉందని వైద్యులు గుర్తించారు. వైద్యం చేయించుకునేందుకు ఆమె దగ్గర డబ్బు లేదు. వైద్య బీమా కూడా లేకపోవడంతో ఆమె దిక్కుతోచని స్థితిలో పడింది.
విషయం తెలుసుకున్న మైఖేల్ మరో ఆలోచన లేకుండా తన రెస్టారెంట్ను అమ్మేసి ఆమెకు సహాయపడ్డాడు. 'నా కోసమే బతకాలను కోవడం లేదు. తోటివారు కష్టాల్లో ఉన్నప్పుడు తాను డబ్బు సంపాదించుకోవడంలో అర్థం లేదు. పరులకు సహాయపడడంలోనే అసలైన ఆనందం ఉంది' అని మైఖేల్ వ్యాఖ్యానించాడు.
తన కూతురికి మైఖేల్ ప్రాణం పోశాడని బ్రిటానీ తల్లి బార్బారా మాథిస్ పేర్కొంది. మంచితనానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచాడని వ్యాఖ్యానించింది. తన పెద్ద కూతురితో కలిసి ఆమె కూడా మైఖేల్ రెస్టారెంట్లో పనిచేస్తోంది. బార్బారా భర్త జాన్ మాథిస్ 33 ఏళ్ల వయసులో బ్రెయిన్ ట్యూమర్తోనే 2000లో మృతి చెందాడు.