
టెక్సస్ : ప్రతిఫలం ఆశించకుండా ఏ పని చేసినా, ఫలితం ఏదో రూపంలో వస్తుందంటారు. అలాగే న్యూటన్ మూడో నియమం ప్రకారం చర్యకు, ప్రతి చర్య ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇది చాలా సందర్భాలలో నిరూపితమయింది కూడా. మానవ జీవితం కూడా ఈ సిద్ధాంతంతో ముడిపడి ఉందనడానికి ఓ మహిళా వెయిటర్ జీవితంలో జరిగిన సంఘటనే నిదర్శనం. 18 ఏళ్ల ఏవోని విలియమ్స్ అమెరికా టెక్సస్‌లోని లా మార్య్కూలో ఉన్న వాఫెల్ హౌస్‌లో వెయిట్రస్‌గా ఉదయం పూట పనిచేస్తుంది.
తన విధుల్లో భాగంగా విలియమ్స్ చేసిన చిన్న సహాయం తనకు కీర్తితోతోపాటు మరచిపోలేని జ్ఞాపకాన్ని మిగిల్చింది. చార్పెంటియర్ అనే ముసలాయన రెగ్యులర్‌గా ఆ హోటల్‌లో బ్రెక్‌ఫాస్ట్ చేయడానికి వస్తుండేవాడు. ఇటీవలే ఆయనకు ఆపరేషన్ జరిగింది. దీంతో సొంతంగా ఆహార పదార్థాలను ముక్కలుగా చేసుకొని తినడానికి ఇబ్బంది పడేవాడు. ఇది గమనించిన విలియమ్స్ అతని ఆహారాన్ని స్వయంగా తానే ముక్కలుగా చేసి ఇచ్చింది. అక్కడే ఉన్న లారా ఓల్ఫ్ అనే కస్టమర్ ఈ ఫొటోని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఈ సహాయం ఆ పెద్దాయనకు చిన్నదిగా తోచవచ్చునేమో కానీ, నా దృష్టిలో మాత్రం ఇది చాలా గొప్పది అనే లారా ఫేస్‌బుక్‌లో కామెంట్ చేశారు. అనతికాలంలోనే ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎంతోమంది విలియమ్స్‌ని ప్రశంసలతో ముంచెత్తారు. టెక్సస్ సదరన్ యూనివర్సిటీ 16వేల డాలర‍్ల(10 లక్షల రూపాయలు) ఉపకారవేతనాన్ని అందించింది. లా మార్క్య్ మేయర్ కూడా విలియమ్స్ దయ హృదయాన్ని గుర్తించారు. మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా స్థానికంగా విలియమ్స్ డేగా ప్రకటించారు. చాలామంది ఏదైనా సహాయం చేయ్యాలంటే ఆలోచించే ఈ రోజుల్లో విలియమ్స్ ప్రతిఫలం ఆశించకుండా చేసిన చిన్న సహాయం తన జీవితానికి దారి చూపడంతో పాటు, ఏనలేని కీర్తిని తెచ్చిపెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment