
రాముడికి ఆ పార్టీ 21 ఏళ్ల వనవాసమిచ్చింది!
న్యూఢిల్లీ: శ్రీరాముడికి బీజేపీ 21 ఏళ్ల వనవాసాన్ని ప్రసాదించిందని, 21 ఏళ్లుగా ఆ పార్టీ యూపీలో రామమందిరం కడతామని తన మ్యానిఫెస్టోలో చెపుతూనే ఉందని కాంగ్రెస్ పార్టీ ఆదివారం పేర్కొంది. '1996 నుంచి శ్రీరాముడికి బీజేపీ 21 ఏళ్ల వనవాసాన్ని ఇచ్చింది. ఆఖరికీ రాముడికి కూడా బీజేపీపై విశ్వాసం సన్నగిల్లి ఉండాలి. 21 ఏళ్లు ఎవరు ఎదురుచూస్తారు. చాలా ఏళ్లుగా వాళ్లు రామమందిరం కడతామని మ్యానిఫెస్టోలో చెప్తూనే ఉన్నారు' అని కాంగ్రెస్ నాయకుడు టామ్ వడక్కన్ పేర్కొన్నారు. రామమందిరం కడతామంటూ బీజేపీ ప్రజలకు హామీలు ఇస్తూనే ఉందని, ఆ పార్టీకే కాదు రాముడికి సైతం ఇది నినాదంగా మారిందని పేర్కొంది.
ఉత్తరప్రదేశ్‌లో తాము అధికారంలోకి వస్తే అయోధ్యలో రామమందిరాన్ని 'రాజ్యాంగానికి లోబడి' నిర్మిస్తామని బీజేపీ శనివారం తన మ్యానిఫెస్టలో ప్రకటించిన సంగతి తెలిసిందే. రామమందిరం విషయంలో బీజేపీ తన వైఖరికి కట్టుబడి ఉందని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు.