సవాలుగా వామపక్ష తీవ్రవాదం
అన్ని రాష్ట్రాలు కలసికట్టుగా తిప్పికొట్టాలి
♦ తీరప్రాంత భద్రతను పటిష్టం చేయాలి
♦ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పిలుపు
♦ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో ప్రారంభోపన్యాసం
♦ రాష్ట్రాల మధ్య సహకారానికి ప్రాంతీయ, అంతర్రాష్ట్ర మండళ్ల దోహదం
సాక్షి, విజయవాడ బ్యూరో: వామపక్ష తీవ్రవాదం నుంచి దేశం తీవ్రమైన సవాళ్లు ఎదుర్కొంటోందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలు కలసికట్టుగా దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరముందన్నారు. అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో తీరప్రాంత రక్షణ కూడా సవాలుగా మారిందని, దీనిని పటిష్టం చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. 26వ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం శనివారమిక్కడ జరిగింది. దీనికి అధ్యక్షత వహించిన రాజ్‌నాథ్‌సింగ్ ప్రారంభోపన్యాసం చేశారు. దేశప్రగతికి సమాఖ్య వ్యవస్థలోని ప్రాంతీయ మండలి ఫోరం కీలకపాత్ర వహిస్తుందని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రాంతీయ, అంతర్రాష్ట్ర మండళ్లను బలోపేతం చేయడానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చినట్టు తెలిపారు. కేంద్ర, రాష్ట్రాలమధ్య పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి ఈ మండళ్లు ఉపయోగపడతాయన్నారు. రాష్ట్రాలమధ్య నిర్మాణాత్మక సహకారానికి, సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరగడానికి ఈ వ్యవస్థలు కీలకమని చెప్పారు.
వరద బాధితుల్ని ఆదుకుంటాం
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో భారీవర్షాలవల్ల చనిపోయిన వారికి సమావేశం నివాళులర్పించింది. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది. రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ.. వరద బాధితులు సాధారణ స్థాయికి చేరుకునేవరకు కేంద్రం అన్నివిధాలుగా సహకారమందిస్తుందని హామీఇచ్చారు. బాధితులకు పునరావాసం కల్పిస్తామని, సహాయకచర్యలను కొనసాగిస్తామని తెలిపారు.
పలు అంశాలపై చర్చ...
సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. తీరప్రాంత భద్రత, పారిశ్రామిక కారిడార్, పర్యాటక రైళ్లను ప్రవేశపెట్టడం, పారిశ్రామిక రాయితీల మంజూరులో ఒకేరకమైన విధానం అమలు, అంతర్రాష్ట్ర రవాణా ఒప్పందాలు, పళ్లు, కూరగాయల సాగులో ప్రమాదకర పురుగుమందుల వాడకాన్ని తగ్గించడం, ఆరోగ్యసేవలు, నర్సింగ్, పవర్ ట్రాన్స్‌మిషన్ లైన్లలో ఒకేరకమైన నాణ్యతా ప్రమాణాలు పాటించడంపై చర్చించారు. 2012లో బెంగళూరులో జరిగిన సమావేశం చేసిన సిఫారసుల అమలు ఎంతవరకూ వచ్చిందనే విషయాలపైనా సమీక్షించారు. సమావేశ వివరాల్ని మండలి సమన్వయకర్త(కోఆర్డినేటర్) జయశీలన్.. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతో కలసి మీడియాకు వివరించారు. వివరాలివీ..
► తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బలగాలు పెంచుతామని కేంద్ర హోంశాఖ తెలిపింది. అదనపు బలగాలు, భద్రతా చర్యలకు అవసరమైన ఖర్చును కేంద్రమే భరిస్తుందని పేర్కొంది.
► చెన్నై-బెంగళూరు-అమరావతి-హైదరాబాద్ మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్‌ను నిర్మించాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. దీనిపై సాధ్యాసాధ్యాల నివేదిక పంపితే ప్రతిపాదనను పరిశీలిస్తామని రైల్వేశాఖ తెలిపింది. ఈస్ట్‌కోస్ట్‌లో సరకు రవాణాకోసం మూడో రైల్వేలైన్‌ను ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రతిపాదించగా పరిశీలిస్తామని రైల్వే అధికారులు హామీ ఇచ్చారు.
► నియోజకవర్గాల పునర్విభజన జరగాలని ఏపీ, కేరళ రాష్ట్రాలు కోరగా పరిశీలిస్తామని కేంద్ర హోంశాఖ హామీఇచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ నుంచి ఏపీలో కలసిన ఏడు మండలాల గురించి సీఎం చంద్రబాబు ప్రస్తావించగా.. అక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు సహకరిస్తామని హోంశాఖ తెలిపింది.
► మహిళల అక్రమ రవాణాను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
► తదుపరి సమావేశాన్ని కేరళలోని త్రివేండ్రంలో నిర్వహించాలని నిర్ణయించారు.
► సమావేశంలో ఏపీ ఉప ముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ అజయ్‌కుమార్‌సింగ్, కేరళ జలవనరులశాఖ మంత్రి పీజే జోసెఫ్, తమిళనాడు మంత్రి పన్నీర్ సెల్వం, ఐదు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు రాష్ట్రాల విద్యుత్ వివాదంపై చర్చ
దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విద్యుత్ వివాదాన్ని తెలంగాణ లేవనెత్తినట్లు సమాచారం. అయితే రెండు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి సంబంధించి ప్రత్యేకమైన యంత్రాంగం ఉన్నందున.. అక్కడే దీనిపై చర్చించాలని మండలిలో అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. అలాగే జాతీయ రహదారుల బిల్లుపైనా తెలంగాణ పలు అభ్యంతరాల్ని లేవనెత్తినట్లు సమాచారం.