
విస్తృత సహకారం దిశగా..!
ముగిసిన సార్క్ సదస్సు
విద్యుత్ సహకార ఒప్పందంపై సంతకాలు
పాక్ మోకాలడ్డడంతో కుదరని అనుసంధాన ఒప్పందాలు
కఠ్మాండు: నేపాల్ రాజధాని కఠ్మాండులో రెండు రోజుల పాటు జరిగిన 18వ సార్క్(సౌత్ ఆసియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్) శిఖరాగ్ర సదస్సు గురువారం ముగిసింది. ఆఖరి నిమిషంలో.. విద్యుత్‌రంగంలో పరస్పర సహకారానికి సంబంధించిన ఒప్పందంపై సార్క్ దేశాలు సంతకాలు చేశా యి. ఈ ఒప్పందం ద్వారా 8 సభ్య దేశాల ప్రాంతీయ విద్యుత్ గ్రిడ్ల అనుసంధానత, వాటి ఐక్య నిర్వహణ, సభ్య దేశాల మధ్య విద్యుత్ వాణిజ్యం సాధ్యమవుతుంది.
కాగా, పాకిస్తాన్ సహకరించకపోవడంతో సార్క్ సభ్య దేశాల మధ్య మరింత మెరుగైన అనుసంధానత కోసం రూపొందించిన ఒప్పందాలకు నేపాల్‌లో ఈ సదస్సులో ఆమోదం లభించలేదు. వాటిలో సభ్యదేశాల మధ్య రోడ్డు, రైల్వే, జల రవాణాల ద్వారా ప్రజలు, వస్తువుల రవాణాను సులభతరం చేసే మోటారు వాహన, రైల్వే ఒప్పందాలున్నాయి. పాక్ మినహా మిగతా సభ్యదేశాలన్నీ ఆ ఒప్పందాలకు అత్యంత సానుకూలంగా ఉన్నాయి. విద్యుత్‌రంగంలో సహకారానికి సంబంధించిన ఒప్పందాన్ని కూడా మొదట్లో పాక్ వ్యతిరేకించింది. పాక్‌లో అంతర్గత ప్రక్రియ పూర్తి కానందున ఈ ఒప్పందాన్ని ఇప్పుడే అంగీకరించలేమంది. కానీ పలువురు సభ్యదేశాధినేతలు పాక్ ప్రధాని షరీఫ్‌తో చర్చించి ఒప్పించారు.
తదుపరి సదస్సు నిర్వహణకు పాక్‌కు అవకాశం ఇచ్చినందుకు ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ సభ్య దేశాధినేతలకు కృతజ్ఞతలు తెలిపారు. సభ్య దేశాల మధ్య సహకారం మరింత పెరిగేలా.. సమస్యల పరిష్కారానికి ఆచరణాత్మక కార్యాచరణను రూపొం దించుకోవాలన్నారు. ఈ సదస్సుకు అఫ్ఘానిస్థాన్, శ్రీలంక, మాల్దీవుల అధ్యక్షులు, భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ దేశాల ప్రధానులు హాజరయ్యారు.
పరిశీలక దేశాలకు మరింత ప్రాతినిధ్యం
పరిశీలక హోదాలో ఉన్న చైనా తదితర దేశాలకు మరింత ప్రాధాన్యతనివ్వాలని సార్క్ నిర్ణయించింది. అందులో భాగంగా ప్రాధాన్య రంగాల్లో ఉత్పత్తి, డిమాండ్ ఆధారిత ప్రాజెక్టుల్లో వారిని భాగస్వామ్యులను చేయాలని సభ్యదేశాలు నిర్ణయించాయి. సార్క్‌లో శాశ్వత సభ్యత్వం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్న చైనా ఒత్తిడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, సార్క్‌ను విస్తరించాలన్న ప్రతిపాదనేదీ ప్రస్తుతానికి లేదని భారత విదేశాంగ అధికార ప్రతినిధి అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా, చైనా, ఇరాన్, జపాన్, దక్షిణ కొరియా, మారిషస్, మయన్మార్, అమెరికా, యూరోపియన్ యూనియన్ పరిశీలక హోదాలో సార్క్ సదస్సులో పాల్గొన్నాయి.
కఠ్మాండు ప్రకటన
సార్క్ సదస్సు ముగింపు సందర్భంగా ‘కఠ్మాండు ప్రకటన’ను సభ్య దేశాలు విడుదల చేశాయి. ‘ఉగ్రవాదాన్ని, హింసాత్మక తీవ్రవాదాన్ని, అవి ఏ రూపంలో ఉన్నప్పటికీ.. సభ్య దేశాధినేతలు ముక్తకంఠంతో ఖండించారు. వాటిపై పోరులో సభ్య దేశాల మధ్య సమర్థ సహకారం అవసరమని స్పష్టం చేశారు’ అని అందులో పేర్కొన్నారు. ‘సార్క్ ఏర్పడి ముప్పై యేళ్లయింది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా.. ప్రాంతీయ సహకారానికి పునఃప్రతిష్ట చేయాల్సిన, కూటమిని పునరుత్తేజపర్చాల్సిన అవసరాన్ని సభ్య దేశాల నేతలు గుర్తించారు’అని పేర్కొన్నారు.
వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, భద్రత, మౌలిక వసతులు, సంస్కృతి రంగాల్లో సహకారాన్ని విస్తృతపర్చుకోవాలని నిర్ణయించారు. స్వేచ్ఛా వాణిజ్యం, ఉమ్మడి మార్కెట్, ఉమ్మడి ఆర్థిక, ద్రవ్య వ్యవస్థగా ‘సౌత్ ఆసియా ఎకనమిక్ యూనియన్(ఎస్‌ఏఈయూ)’ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. సార్క్ అభివృద్ధి నిధి(ఎస్‌డీఎఫ్)ని బలోపేతం చేయాలని నిర్ణయించారు.
మోదీపై నేపాల్ మీడియా గరం గరం!
నేపాల్ రాజ్యాంగ రచనకు సంబంధించి భారత ప్రధా ని మోదీ నేపాల్ నేతలకు సలహాలివ్వడంపై ఆ దేశ మీడియా మండిపడింది. వాటిని దౌత్య నియమాల ఉల్లంఘనగా అభివర్ణించింది. నేపాల్ రాజకీయ నేతలతో భేటీ సందర్భంగా ఏకాభిప్రాయం ద్వారా రాజ్యాంగ రచన సాగించాలని, నిర్ణీత గడవు అయిన జనవరి 22లోగా రాజ్యాంగ రచనను పూర్తి చేయాలని మోదీ సూచించారు. సదస్సు ముగిసిన తరువాత మోదీ గురువారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు.