సరైన దారిలోనే.. భారత ఆర్థిక వ్యవస్థ: సీఐఐ సర్వే
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది. దేశంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. నిధుల సమీకరణ వ్యయాలు తక్కువగా ఉండటం, అధిక ద్రవ్య లభ్యత, బలమైన విదే శీ ఆర్థిక సంబంధాలు, ఆర్థిక కార్యకలాపాల వృద్ధి వంటి అంశాలు ఆర్థిక పరిస్థితుల మెరుగుదలకు దోహదపడ్డాయని సీఐఐ, ఐబీఏ సంయుక్త సర్వేలో వెల్లడైంది. గత త్రైమాసికంలో 67.8 వద్ద ఉన్న ఆర్థిక పరిస్థితుల సూచీ ప్రస్తుతం 70.3 వద్దకు చేరింది. సర్వేలో పాల్గొన్న చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు... గత త్రైమాసికంతో పోలిస్తే ప్రస్తుతం దేశంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయని అభిప్రాయపడ్డాయి.
దేశంలో స్థూల ఆర్థిక పరిస్థితులు పుంజుకోవడంతో భారత ఆర్థిక వ్యవస్థ సరైన దారిలోనే పయనిస్తోందని సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ తెలిపారు. ప్రస్తుత త్రైమాసికపు ప్రారంభంలో ఆర్‌బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించిందని, ఈ చర్య వల్ల ప్రస్తుత త్రైమాసికంలో నిధుల సమీకరణకు అయ్యే వ్యయాలు తగ్గవచ్చని చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయని తెలిపారు. ఆర్‌బీఐ తన పాలసీ సమీక్షలో వృద్ధికి దోహదపడే చర్యలు తీసుకోవడానికి ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల సూచీ మెరుగుదల ఊతమివ్వనుందని పేర్కొన్నారు.