- 22 మందికి స్థానచలనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిపాలన పీఠాల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకేసారి 22 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. వెయిటింగ్‌లో వున్న పలువురికి కొత్త పోస్టింగ్‌లు కేటాయించింది. మరికొందరికి అదనపు బాధ్యతలు అప్పగించింది. రాష్ర్ట విభజనలో భాగంగా ఏపీ కేడర్‌కు వెళ్లాల్సి ఉన్న వారిలో ఓ అధికారిని రిలీవ్ చేసింది. ఈ మేరకు సీఎస్ రాజీవ్ శర్మ ఆదివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అందరూ ఊహించినట్లే పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రదీప్ చంద్రను కీలకమైన ఆర్థిక శాఖకు ప్రభుత్వం బదిలీ చేసింది.
ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి వి.నాగిరెడ్డిని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నియమించడంతో ఈ పోస్టు ఖాళీ అయింది. ఇక సుదీర్ఘ కాలంగా సాధారణ పరిపాలన శాఖలో రాజకీయ కార్యదర్శిగా పనిచేస్తున్న అజయ్ మిశ్రాను రెవెన్యూ శాఖకు బదిలీ చేసింది. అఖిల భారత సర్వీసు అధికారుల పంపకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు వెళ్లాల్సి ఉన్న వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్యను రిలీవ్ చేయడం గమనార్హం. అయితే, ఏపీ కేడర్‌కు వెళ్లాల్సి ఉన్న జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ విషయంలో ఎలాంటి చర్య తీసుకోలేదు.
ఇంధన శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్‌కు పరిశ్రమల శాఖ బాధ్యతలను అదనంగా అప్పగించింది. కాగా, మంత్రి కేటీఆర్ ఒత్తిడి మేరకు ఆ శాఖ కార్యదర్శి హర్‌ప్రీత్ సింగ్‌ను తప్పించిన ప్రభుత్వం ఆయన స్థానంలో టీఎస్‌ఐఐసీ వైస్‌చైర్మన్ జయేశ్ రంజన్‌ను నియమించింది. ఆయన స్థానంలో టీఎస్‌ఐఐసీ వైస్‌చైర మన్, ఎండీగా ఆ సంస్థ ఈడీ ఎ.వి. నరసింహరెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించింది.
జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసిన సమాచార, ప్రజా సంబ ధాల శాఖ కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్‌ను కీలకమైన ఎక్సైజ్ శాఖకు బదిలీ చేశారు. ఇక అజయ్ మిశ్రాసతీమణి శాలినీ మిశ్రాకు ప్రతిష్టాత్మక వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. తుది కేటాయింపుల్లో తెలంగాణకు వచ్చిన వికాస్‌రాజ్‌కు సాధారణ పరిపాలన శాఖలో రాజకీయ కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది.