భారత్‌లో ఏకైక ప్రైవేట్‌ రైల్వే ‘శకుంతల’ | the only private railways in india, namely shakuntala | Sakshi
Sakshi News home page

భారత్‌లో ఏకైక ప్రైవేట్‌ రైల్వే ‘శకుంతల’

Published Wed, Feb 1 2017 3:02 PM | Last Updated on Tue, Sep 5 2017 2:39 AM

భారత్‌లో ఏకైక ప్రైవేట్‌ రైల్వే ‘శకుంతల’

భారత్‌లో ఏకైక ప్రైవేట్‌ రైల్వే ‘శకుంతల’

మహాకవి కాళిదాసు రాసిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ సంస్కృత నాటకం గురించి, అందులోని శకుంతల పాత్ర గురించి బహూశ భారతీయులందరికీ తెలిసే ఉంటుంది. కానీ శకుంతల పేరిట ఓ రైల్వే లైనుందని, అది భారతీయ రైల్వేలో భాగం కాదని, ఆ రైల్వే లైన్‌పై శకుంతల ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇప్పటికీ నడుస్తోందని, అది ఓ బ్రిటిష్‌ కంపెనీకి సొంతమని  ఎంతమందికి తెలుసో తెలియదు. బ్రిటిష్‌ పాలకుల కాలం నుంచి వస్తున్న ఆనవాయితీని బ్రేక్‌ చేసి రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో కలిపిన కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ శకుంతల రైల్వేలైన్‌ను కూడా భారతీయ రైల్వేలో కలిపేందుకు చర్యలు తీసుకుంటే బాగుండేదేమో. 
 
మహారాష్ట్రలోని ముర్తాజాపూర్, యవత్మల్‌ మధ్య 190 కిలోమీటరు దూరం మధ్య శకుంతల ఎక్స్‌ప్రెస్‌ రైలు గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ఇప్పటికీ నడుస్తోంది. ఈ రైలు గ్రామీణ ప్రాంతాలకు జీవనాధారం. కిల్లిక్‌ నిక్సన్‌ అనే బ్రిటిష్‌ కంపెనీ భారత్‌లోని అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వంతో కలసి 1910లో ‘సెంట్రల్‌ ప్రావిన్స్‌ రైల్వే లైన్‌ కంపెనీ’ (సీపీఆర్‌ఎల్‌)ని ఏర్పాటు చేసి విదర్భ నుంచి పత్తిని రవాణా చేసేందుకు శకుంతల రైల్వే లైన్‌ను ఏర్పాటుచేసింది. 1916 నుంచి ఈ లైన్‌పై పత్తి రవాణాకు రైళ్లు నడిచాయి. ఆ తర్వాత ప్రయాణికుల రైళ్లు నడిచాయి. ఆ తర్వాత భారతీయ రైల్వే లైన్‌కు ఈ లైన్‌ అనుసంధానమైంది. 
 
దీంతో అప్పటి సెంట్రల్‌ ఇండియా ఆధ్వర్యంలోని గ్రేట్‌ ఇండియాలోని పెనిన్సులార్‌ రైల్వే (జీఐపీఆర్‌)కు చెందిన పలు రైళ్లు కూడా ఈ రైల్వేలైన్‌ మీదుగా నడిచేవి. దేశ స్వాతంత్య్రం అనంతరం 1952లో భారత ప్రభుత్వం జీఐపీఆర్‌ సహా దేశంలోని అన్ని రైల్వేలైన్లను జాతీయం చేసింది. ఒక్క కిల్లిక్‌ నిక్సన్‌ కంపెనీ ఆధ్వర్యంలోని సీపీఆర్‌ మాత్రం అలా కాలేదు. ఈ కంపెనీని జాతీయం చేయకుండా ఎందుకు  భారత ప్రభుత్వం మరచిపోయిందో తెలియదు. ఆ తర్వాత కిల్లిక్‌ నిక్సన్‌ కంపెనీ బ్రిటన్‌ నుంచి భారత్‌కు తరలివచ్చినా దానినుంచి శకుంతల రైల్వేలైన్‌ను స్వాధీనం చేసుకునేందుకు భారత్‌ ఎందుకు ప్రయత్నించలేదో కూడా అర్థం కాదు. 
 
భారతీయ రైల్వే ఈ ప్రైవేటు శకుంతల రైల్వే లైన్‌ను వాడుకుంటున్నందుకు రాయల్టీ చెల్లిస్తూ వస్తోంది. పదేళ్లకోసారి ఈ ఒప్పందాన్ని పునరుద్ధరిస్తోంది. అలా ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఆరుసార్లు ఒప్పందాన్ని పునరుద్ధరించింది. ఈ లైన్‌పై 1921లో మాంచెస్టర్‌లో తయారైన ఇంజన్‌తో శకుంతల ఎక్స్‌ప్రెస్‌ నడిచేది. దీన్ని 1994, ఏప్రిల్‌ 15వ తేదీన పాత ఇంజన్‌ను తీసేసి డీజిల్‌ ఇంజన్‌ను ఏర్పాటుచేశారు. న్యారోలైన్‌పై నడిచే ఈ రైలు ప్రయాణికులు ఎక్కడుంటే అక్కడ ఆగి వారిని ఎక్కించుకుంటుంది. టిక్కెట్‌ ధర కూడా భారతీయ రైళ్లకన్నా ఎంతో చౌక. అందుకని ఈ ప్రాంతంలోని గ్రామీణ ప్రజలు ఈ రైలు ఎక్కేందుకే ఎక్కువ ఇష్టపడతారు. ఈ న్యారో రైల్వేలైన్‌ను బ్రాడ్‌గేజ్‌గా మార్చాలని గత బడ్జెట్‌లోనే రైల్వేశాఖ ప్రతిపాదించింది. అది పూర్తయితే శకుంతల ఎక్స్‌ప్రెస్‌ కూడా బ్రాడ్‌గేజ్‌కు మారుతుందా, ఈ లోగా భారతీయ రైల్వేలో విలీనం అవుతుందా.. చూడాలి! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement