'పార్లమెంట్లో ఒకరిద్దరు ఉగ్రవాదులు'
రూర్కీ: 'భారత పార్లమెంట్లో ఒకరిద్దరు ఉగ్రవాదులు ఉన్నారు. దురదృష్టమేమంటే ప్రస్తుతం వారు ఎంపీలుగా కొనసాగుతున్నారు. పదేపదే న్యాయవ్యవస్థను ధిక్కరించేలా కల్లోలపూరితంగా మాట్లాడతారు' అని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) నేత సాధ్వి ప్రాచీ.. తనకు అలవాటైన మాదిరే మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, జమ్ముకశ్మీర్లోని ఉధంపూర్లో పట్టుబడ్డ పాక్ ఉగ్రవాది మహమ్మద్ నవేద్ యాకూబ్ను హిందూ సంస్థల చేతికి అప్పగించాలని డిమాండ్ చేశారు.
రూర్కీలో గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడారు. యాకూబ్ మెమన్ ఉరితీతపై విలేకరుల ప్రశ్నలకు బదులిస్తూ.. ముంబై పేలుళ్ల కేసులో దోషిగా రుజువైనందునే యాకూబ్ మెమన్కు అత్యున్నత న్యాయస్థానం మరణశిక్ష విధించిందని, కొందరు ఎంపీలు మాత్రం న్యాయవ్యవస్థను ధిక్కరించేలా యాకూబ్ ఉరిపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
'నా దృష్టిలో ఉగ్రవాదులకు మద్దతుగా మాట్లాడేవారు కూడా ఉగ్రవాదులే. పార్లమెంట్లో అలాంటి వాళ్లు ఒకరిద్దరు ఉన్నారు. ఇక కశ్మీర్లో పట్టుబడ్డ ఉగ్రవాది విషయంలో మోదీ ప్రభుత్వానికి నేనొక మనవి. దర్యాప్తు సంస్థల విచారణ పూర్తికాగానే ఉగ్రవాది నవేద్ను హిందూ సంస్థలకు అప్పగించాలి. వాడికి తగిన బుధ్ది చెప్తాం' అని సాధ్వి ప్రాచీ అన్నారు.
ప్రాచీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ప్రజాస్వామ్యానికి దేవాలయంలాంటి పార్లమెంట్ పట్ల సాధ్వి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవని, ఎంపీలను ఉగ్రవాదులతో పోల్చడం దారుణమని, స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ విషయంలో జోక్యం చేసుకుని సాధ్వి ప్రాచీపై చర్యలకు ఆదేశించాలని కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారి డిమాండ్ చేశారు.