మా మంచి డాక్టర్లు ఎందరో!
న్యూఢిల్లీ: కాసుల కోసమే కార్పొరేట్ ఆస్పత్రులు పనిచేస్తున్న నేటి రోజుల్లో ప్రజల ఆరోగ్యం కోసం కంకణబద్దులై గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ డాక్టర్లు ఉండడం మన అదష్టం. ఎవరి ఆదేశం లేకుండానే స్వచ్ఛందంగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లూ ఉండడం ఇంకా విశేషం. 24 గంటలు వైద్య సేవలు కొనసాగించాల్సిన రంగంలో డాక్టర్లు రోజూ 16 గంటలపాటు, కొన్ని సార్లు ఏకబిగినా 34 గంటలపాటు వైద్య సేవలు అందిస్తున్న మహానుభావులు ఉన్నారు. జాతీయ డాక్టర్ల దినోత్సవమైన జూలై ఒకటవ తేదీన అలాంటి వారి గురించి స్మరించుకోవడం ఎంతైన సబబే.
జాతీయ డాక్టర్ల దినోత్సవాన్ని ఒక్కో దేశంలో ఒక్కోరోజు జరపుకుంటారు. భారత దేశంలో జూలై ఒకటవ తేదీన జరపుకోవడానికి కారణం డాక్టర్ బిదాన్ చంద్ర రాయ్. ఆయన ప్రముఖ డాక్టరవడమే కాకుండా పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన 1882 జూలై ఒకటవ తేదీన జన్మించారు. 1962, జూలై ఒకటవ తేదీన మరణించారు. ఒకతేదీన పుట్టి, ఒకే తేదీన మరణించిన డాక్టర్ రాయ్ గౌరవార్థం భారత దేశం ఈ రోజును జాతీయ దినోత్సవంగా జరుపుతోంది. ఒకప్పుడు మన దేశంతోపాటు పలు ప్రపంచ దేశాల్లో డాక్టర్ల దినోత్సవం సందర్భంగా డాక్టర్లకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలకేవారు. మధ్యాహ్నం వారి గౌరవార్థం విందు భోజనం ఏర్పాటు చేసేవారు. కొన్ని దేశాల్లో ఈ రోజును డాక్లర్ల సెలవుదినంగా పరిగణించేవారు. రోగులు పండగ చేసుకునేవారు. రానురాను ఈ రోజు ప్రాముఖ్యతను మరచిపోతున్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సేవలు ఇప్పటికి కూడా పట్టణ ప్రాంతాలకే పరిమితం అవుతున్నాయి. ‘ఆర్గనైజేషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఇండియా’ విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం 80 శాతం ఆస్పత్రులు, 75 శాతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 80 శాతం వైద్యులు పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 72 శాతం ప్రజలు నివసిస్తుండగా, పట్టణ ప్రాంతాల్లో 28 శాతం మంది ప్రజలు నివసిస్తున్నారు. అంటే తక్కువ జనాభా ఉండే పట్టణాల్లోనే ఎక్కువ మంది డాక్టర్లు పనిచేస్తున్నారు. మొత్తం ప్రభుత్వ డాక్లర్లు లక్షకుపైగా ఉండగా, వారిలో 30 వేల మంది గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో కొంత మంది డాక్టర్లు స్వచ్ఛందంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి వైద్య సేవకు తమ జీవితాలను అంకితం చేస్తున్నారు. అలాంటి వారిలో ముంబైకి చెందిన డాక్టర్ రవీంద్ర కోహ్లీ దంపతులు ఉన్నారు. ఆయన భార్య పేరు స్మితా కోహ్లీ. మారుమూల ప్రాంతమైన మహారాష్ట్రలోని భైరాగఢ్ వెళ్లి అక్కడ వైద్య సేవలు అందించానుకున్నారు. ఆ షరతు మీదనే నాగపూర్‌కు చెందిన డాక్టర్ స్మిత్‌ను పెళ్లి చేసుకున్నారు. దంపతులు ఆ ప్రాంతం ప్రజలకు వైద్య సేవలు అందించడంతోపాటు తన మిత్రుడైన వెటర్నరీ డాక్టర్ ద్వారా పశు వైద్యాన్ని కూడా నేర్చుకొని రైతులకు సేవ చేశారు. అంతేకాకుండా వ్యవసాయ పంటలు దెబ్బతినకుండా రసాయనాలు ఎలా వాడాలో తెలసుకొని రైతులకు సహకరించారు. ఒరిస్సాకు చెందిన డాక్టర్ అక్వినాస్ రిటైరైన తర్వాత, అంటే 61వ ఏట ఆదివాసులకు వైద్య సేవలు అందించేందుకు వారుండే అటవి ప్రాంతాలకు వెళ్లి అక్కడే స్థిరపడి వారికి వైద్య సేవలు అందించడం ప్రారంభించారు.
పిల్లల కార్డియాక్ సర్జన్ డాక్టర్ గోపి, ఆయన భార్య డాక్టర్ హేమ ప్రియ ప్రభుత్వాస్పత్రుల్లో మంచి ఉద్యోగాలు వదిలిపెట్టి దక్షిణ తమిళనాడులోని మారుమూల పల్లెల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. పిల్లల గుండె శస్త్ర చికిత్సకు అవసరమైన డబ్బును సేకరించేందుకు ఆయన ఓ ట్రస్ట్‌ను కూడా ఏర్పాటుచేసి నడుపుతున్నారు. ఇలాంటి వారి ఎందరికో జాతీయ డాక్టర్ల దినోత్సవ శుభాకాంక్షలు.