నా సినిమాలో ఆ సీన్లు లేవు!
ఎవరి సెంటిమెంట్లను దెబ్బతీయను
మేవార్ వర్గం గర్వించేలా తెరకెక్కిస్తాను
స్పష్టం చేసిన భన్సాలీ
తాను రూపొందిస్తున్న 'పద్మావతి' సినిమా రాజస్థాన్‌లోని మేవార్ వర్గం గర్వించేలా ఉంటుందని చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ స్పష్టం చేశారు. ఎవరి మనోభావాలు దెబ్బతీసేలా సినిమాను తెరకెక్కించాలని భావించడం లేదని ఆయన తెలిపారు. మేవార్ రాణి 'పద్మావతి' చరిత్ర ఆధారంగా భన్సాలీ తాజాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో చరిత్రను వక్రీకరించి అభ్యంతరకరంగా తెరకెక్కిస్తున్నారని రాజ్‌పుత్ కర్ణిసేన చిత్రయూనిట్‌పై దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఏకంగా దర్శకుడు భన్సాలీపై కర్ణిసేన కార్యకర్తలు చేయి చేసుకొని కొట్టడం కలకలం రేపింది.
ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన భన్సాలీ.. రాణి పద్మావతి, అల్లావుద్దీన్ ఖిల్జీ మధ్య ఎలాంటి అభ్యంతరకరమైన సీన్లుగానీ, డ్రీమ్ సీక్వెన్స్‌గానీ ఉండవని ఆయన స్పష్టం చేశారు. రాజస్థాన్ అంటే తనకు ఎంతో ఇష్టమని, అయినా చిత్రయూనిట్ భద్రతను దృష్టిలో పెట్టుకొని షూటింగ్ నిలిపివేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఎంతో పరిశోధన చేసి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని, స్థానికులు ఇందుకు సహకరించి ఉంటే బాగుండేదని ఆయన తెలిపారు. దాడి ఘటన నేపథ్యంలో జైపూర్ నుంచి ముంబైకి పద్మావతి చిత్ర యూనిట్ తిరుగుప్రయాణమైన సంగతి తెలిసిందే.