ఇంటిపేరు పీకేసి.. నిరసన తెలిపిన హీరో!
ముంబై: ప్రఖ్యాత దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపై రాజ్‌పుత్ కర్ణిసేన దాడి చేయడంపై బాలీవుడ్ చిత్రసీమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. మేవార్ రాణి పద్మావతి విషయంలో చరిత్రను వక్రీకరిస్తూ.. ఆయన 'పద్మావతి' సినిమాను తెరకెక్కిస్తున్నారంటూ కర్ణిసేన ఆయనపై, చిత్రయూనిట్‌పై దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో బాలీవుడ్ అంతా భన్సాలీకి మద్దతుగా నిలిచింది. దాడిని తీవ్రంగా ఖండించింది.
తాజాగా భన్సాలీకి బాలీవుడ్ నటుడు, 'ధోనీ' సినిమా హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మద్దతుగా నిలిచాడు. భన్సాలీపై రాజ్‌పుత్‌ల దాడిని ఖండిస్తూ ఆయన తనదైన శైలిలో నిరసన తెలిపాడు. ట్విట్టర్‌లో ప్రొఫైల్ పేరులో తన కులాన్ని సూచించే ఇంటిపేరును తొలగించాడు. భన్సాలీకి సంఘీభావంగా ఆయన తన పేరులోని 'సింగ్ రాజ్‌పుత్'ను తొలగించి.. ట్విట్టర్‌లో సుశాంత్ అని మాత్రమే ఉంచారు. 'ఇంటిపేర్లపై మమకారం పెంచుకున్నంతకాలంతో మనం ఇలా బాధపడకతప్పదు. మీకు ధైర్యముంటే 'పద్మావతి'కి మద్దతుగా ఇంటిపేరును మాకు ఇచ్చేయండి' అంటూ ఆయన ట్వీట్ చేశారు.