పద్మావతి షూటింగ్ క్యాన్సిల్, ముంబైకి యూనిట్
దీపిక పదుకొనే, రణవీర్ సింగ్, షాహిద్ కపూర్ లీడ్ రోల్స్లో తెరకెక్కుతున్న పద్మావతి సినిమా టీం, షూటింగ్ను క్యాన్సిల్ చేసుకొని ముంబైకి తిరుగుప్రయాణమయ్యారు. కొద్ది రోజులుగా జైపూర్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రయూనిట్పై రాజ్పుత్ కర్నిసేన దాడికి దిగింది. పద్వావతి చరిత్రను వక్రీకరించారంటూ డైరెక్టర్తో పాటు యూనిట్ సభ్యులపై దాడి చేసింది. దీంతో ఆ ప్రాంతాల్లో షూటింగ్కు ప్యాక్ అప్ చెప్పేసిన యూనిట్ తిరుగు పయనమయ్యారు.
మరోవైపు పద్మావతి టీం పై జరిగిన దాడిని బాలీవుడ్ నటులు నిర్మాతలు ఖండించారు. అయితే కర్నిసేన సభ్యులు మాత్రం తమ తప్పేం లేదని చెపుతున్నారు. తమ ప్రాంతంలో షూటింగ్ చేస్తూ... తమ చరిత్రను వక్రీకరిస్తే సహించేది లేదంటూ హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీతో చర్చలకు సిద్ధమన్నకర్నిసేన, దర్శకుడు చరిత్రను వక్రీకరించటం లేదని లిఖితపూర్వక హమీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. జైపూర్లో మరికొద్ది రోజులు షూటింగ్ చేయాల్సి ఉన్నా.., దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ షూట్ క్యాన్సిల్ చేయటంతో తదుపరి షెడ్యూల్ ఎప్పుడు, ఎక్కడ ఉంటుందో అన్న ఆలోచనలో పడ్డారు.
ఈ సినిమాలో పద్మావతిగా నటించిన దీపిక శుక్రవారం జరిగిన సంఘటనతో షాక్ కు గురైంది. 'నిన్న జరిగిన సంఘటన షాక్ లోనే ఉన్నాను. ఈ సినిమాలో పద్మావతి పాత్రధారిగా నేను ఖచ్చితంగా చెప్పగలను సినిమాలో చరిత్రను ఏ మాత్రం వక్రీకరించలేదు. మా ఉద్దేశం మన చరిత్రలోని మహిళల ధైర్యసాహసాలను ప్రపంచానికి పరిచయం చేయటమే' అని ట్వీట్ చేసింది.