
ఆ ముగ్గురు దోషులే!
కటారా కేసులో హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: నితీశ్ కటారా హత్య కేసులో వికాస్ యాదవ్, విశాల్ యాదవ్, సుఖ్‌దేవ్ పహిల్వాన్‌లు దోషులేనని సుప్రీంకోర్టు తేల్చింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. అయితే వారికి శిక్షాకాలం పొడిగించడంపై 6 వారాల్లో వివరణ ఇవ్వాలని ఢిల్లీ సర్కారును ఆదేశించింది. వికాస్, అతని బంధువు విశాల్‌కు విధించిన జీవితఖైదును హైకోర్టు ఫిబ్రవరిలో 25 ఏళ్లకు పెంచింది. శిక్ష త గ్గిస్తూ ఎలాంటి సడలింపులు ఇవ్వొద్దని ఆదేశించింది. కేసులో ఆధారాలు నాశనం చేసినందుకు మరో ఐదేళ్ల అదనపు జైలు శిక్ష విధించింది. సుఖ్‌దేవ్‌కూ శిక్షను 25 ఏళ్లుగా నిర్ధారించింది.
దీన్ని సవాలు చేస్తూ వారు సుప్రీంలో పిటిషన్ వేశారు. సోమవారం కోర్టు విచారణ చేపట్టింది. దోషులకు శిక్షాకాలం పెంపుపై మాత్రమే దృష్టిసారిస్తామని, వారి దోషిత్వంపై మళ్లీ ఎలాంటి విచారణ జరిపేది లేదని ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ దేశంలో నేరగాళ్లే న్యాయం కోసం పోరాడుతున్నారని ఈ సందర్భంగా బెంచ్ వ్యాఖ్యానించింది. తన సోదరి భారతిని ప్రేమించినందుకు 2002, ఫిబ్రవరి 17న నితీశ్ కటారాను వికాస్ యాదవ్ దారుణంగా హత్య చేయడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.