
నన్ను కొనాలనుకున్న వారికి వార్నింగ్ ఇచ్చా!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన 2జీ స్పెక్ట్రమ్ స్కాంలో జైలు శిక్ష అనుభవించి, ప్రస్తుతం బెయిల్ పై ఉన్న మాజీ టెలికాం శాఖ మంత్రి ఏ.రాజా తన వెర్షన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. భారతదేశంలో జరిగిన అతి పెద్ద కుంభకోణాల్లో ఒకటైన 2జీ స్కాంలో రాజా(53) నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. కాగా 2జీ కుంభకోణంపై రాజా రాసిన పుస్తకం ఈ ఏడాది నవంబర్ లో విడుదల కానుంది. ప్రస్తుతం పబ్లిషర్ల వద్ద ఉన్న రాజా పుస్తకంలోని కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి.
తాను టెలికాం శాఖ మంత్రిగా ఉన్నప్పుడు శాఖా పరమైన నిర్ణయాలన్నీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీసుకున్నారని ఆరోపించారు. ప్రధాని చేసిన సూచనల ప్రకారం కేబినేట్ లో కీలక మంత్రులైన చిదంబరం, ప్రణబ్ ముఖర్జీలు పర్యవేక్షించేవారని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకున్నారని తాను భావించినట్లు చెప్పారు. 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో 1.76లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని 2010లో కాగ్ ప్రకటనతో షాక్ గురైనట్లు పేర్కొన్నారు. టెలికాం కంపెనీలకు మార్కెట్ ధరల కంటే అతి తక్కువ ధరలకే స్పెక్ట్రమ్ ను కేటాయించినట్లు కాగ్ పేర్కొన్న విషయం తెలిసిందే.
కావలసిన కంపెనీలకు లంచం తీసుకుని మాజీ మంత్రి రాజా స్పెక్ట్రమ్ కేటాయింపులు చేసినట్లు కాగ్ వ్యాఖ్యానించింది. కాగా టెలికాం స్కాం కార్పొరేట్ సంస్థల మధ్య యుద్ధం, ఒత్తిళ్ల కారణంగా జరిగిందని రాజా పేర్కొనడం విశేషం. కుంభకోణంపై కాగ్ ప్రకటన చేసిన మూడు నెలల తర్వాత రాజా జైలు పాలయ్యారు. 2జీ స్పెక్ట్రమ్ కు లైసెన్స్ లు అందజేయడానికి కొద్ది నెలల ముందు తాను ప్రధానిని కలిసినట్లు రాజా ఆ పుస్తకంలో పేర్కొన్నారు. కార్పొరేట్ కంపెనీలు, కొంతమంది మంత్రులు లైసెన్స్ లు ఇవ్వడాన్ని ఆలస్యం చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు ప్రధానికి వివరించినట్లు చెప్పారు. తనను కొనాలని చూస్తున్న వారికి వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పానని పేర్కొన్నారు.
అనుకున్న సమయానికి బిడ్డింగ్ ప్రాసెస్ జరగాలని ప్రధాని రాజాను కోరినట్లు వివరించారు. కొత్త లైసెన్స్ లు ఇవ్వడానికి ముందు కొన్ని దిగ్గజసంస్థలు లాబీకు తన వద్దకు వచ్చినట్లు చెప్పారు. జీఎస్ఎం ప్లాట్ ఫాం(ఎయిర్ టెల్, వొడాఫోన్)ను వాడుతున్న సంస్థలు సీడీఎమ్ఏ ఫ్లాట్ ఫాం(రిలయన్స్) ఉపయోగిస్తున్న సంస్థలను బిడ్డింగ్ నుంచి తప్పించాలని కోరినట్లు పుస్తకంలో రాశారు. రియల్ ఎస్టేట్ నుంచి టెలికాంలోకి అడుగుపెట్టాలని చూస్తున్న యూనిటెక్ కంపెనీ కూడా లాబీ చేసినట్లు పేర్కొన్నారు. 2జీ స్పెక్ట్రమ్ కు లైసెన్స్ లు ఇవ్వడానికి ముందు యూనిటెక్ ప్రమోటర్ సంజయ్ చంద్రాను, స్వాన్ రియాల్టీ కంపెనీ అధినేత షాహిద్ బల్వాను రాజా కలిసినట్లు సీబీఐ ఆరోపించింది.
అక్రమంగా 2జీ హక్కులు దక్కించుకునేందుకు రాజా యూనిటెక్ తో కలిసి కుట్రపన్నారని పేర్కొంది. రాజాతో పాటు ఇద్దరిని సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా 2007లో సునీల్ మిట్టల్ ను ఆయన నివాసంలోనే తాను కలిసినట్లు రాజా పుస్తకంలో రాయడం విశేషం. ఆ సమావేశాన్ని మాజీ కేంద్రమంత్రి చిదంబరం తనయుడు కార్తి చిదంబరం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కార్తి బడా వ్యాపారవేత్త మిట్టల్ కు తన అవసరం ఏముంటుందని ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. ఈ విషయంపై మిట్టల్ కంపెనీ ప్రతినిధిని సంప్రదించగా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రాజాపై విచారణ కొనసాగుతోంది.