కాంగ్రెస్‌ను కాపాడేందుకే తృతీయ ఫ్రంట్
భువనేశ్వర్, న్యూస్‌లైన్: కాంగ్రెస్‌ను కాపాడేందుకే తృతీయ ఫ్రంట్‌కోసం పావులు కదుపుతున్నారని గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆరోపించారు. స్వరాష్ట్రాల్లో ముఖాలు చెల్లని నాయకులంతా కలిసి మూడోఫ్రంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒడిశా పర్యటనలో భాగంగా స్థానిక బొరొముండా గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన సభలో మంగళవారం ఆయన ప్రసంగించారు. 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన భువనేశ్వర్‌లో పర్యటించడం ఇదే ప్రథమం. ఈ సందర్భంగా తృతీయఫ్రంట్ కోసం వివిధ పార్టీల నేతలు చేస్తున్న ప్రయత్నాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయన ఏమన్నారంటే..
- యూపీలో సమాజ్‌వాదీ పార్టీ కావచ్చు.. పశ్చిమబెంగాల్‌లో లెఫ్ట్ కావచ్చు లేదా ఒడిశాలో బీజేడీ కావచ్చు.. తృతీయ ఫ్రంట్‌కు చెందిన సభ్యులంతా తమ తమ పాలిత రాష్ట్రాలను ధ్వంసం చేసినవారే.
- తృతీయఫ్రంట్ ఏర్పాటుకోసం ఆరాట పడుతున్న 11 పార్టీల్లో 9 కాంగ్రెస్ తొత్తులుగా వ్యవహరించేవే. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇవన్నీ తృతీయఫ్రంట్ ముసుగు కప్పుకున్నాయి. వీటి ఏకైక లక్ష్యం కాంగ్రెస్‌ను కాపాడడమే.
బీజేపీ పాలనలోని పశ్చిమ రాష్ట్రాలు అభివృద్ధిలో నడుస్తుం టే.. కాంగ్రెస్, తృతీయ ఫ్రంట్ ఏర్పాటుకు తాపత్రయ పడుతున్న నేతల పాలనను చవిచూసిన యూపీ, ఒడిశా,బెంగాల్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు పూర్తిగా వెనుకబడి ఉన్నాయి.
- {పజలు కాంగ్రెస్ పాలన, కమ్యూనిస్టుల పాలన, ప్రాంతీయ పార్టీల పాలన, బీజేపీ పాలనలను చూశారు. వీటిలో ఎవరు ప్రజలకోసం పనిచేశారో గుర్తించాలి. అభివృద్ధి కావాలంటే బీజేపీ పాలన సరైందని నేను ఘంటాపథంగా చెప్పగలను. దేశ సమగ్రాభివృద్ధికి నాకు 60 నెలలు అవకాశమివ్వండి.
- బీజేపీ మాజీ మిత్రపక్షమైన బీజేడీపైన, ఆ పార్టీ అధినేత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌పైన మోడీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాను, పట్నాయక్ 14 ఏళ్లుగా సీఎంలుగా కొనసాగుతున్నామని, తన పర్యవేక్షణలో గుజరాత్ అభివృద్ధి పథంలో నడవగా.. చెప్పుకోదగిన వనరులున్నప్పటికీ ఒడిశా ఇంకా పేద రాష్ట్రంగానే మిగిలిందన్నారు.