70 రోజుల్లో తమిళనాడుకు ముగ్గురు సీఎంలు!
70 రోజుల్లో తమిళనాడుకు ముగ్గురు సీఎంలు!
Published Thu, Feb 16 2017 2:08 PM | Last Updated on Tue, Sep 5 2017 3:53 AM
చెన్నై : తమిళనాడు రాజకీయాలపై ఓ వైపు ఎంతో ఉత్కంఠగా సాగుతున్న సమయంలో సోషల్ మీడియాలో ఓ జోక్ విపరీతంగా సర్క్యూలేట్ అయింది. తమిళనాడు సీఎం పేరుపై విద్యార్థులకు అడిగే ప్రశ్నాపత్రంలో క్వార్టర్లీ, ఆఫ్ ఇయర్లి, యాన్యువల్ ఎగ్జామ్స్ లో విద్యార్థులు ఒక్కో పేరును రాయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ ఆ జోక్. క్వార్టర్లీ, ఆఫ్ ఇయర్లి, యాన్యువల్ ఏమో గాని, 70 రోజుల్లోనే తమిళనాడుకు ముగ్గురు సీఎంలు మారారు. అమ్మ మరణించేంత వరకు అంటే 2016 డిసెంబర్ 11 వరకు జయలలితనే సీఎం కాగా, ఆ రోజు అర్థరాత్రినే పన్నీర్ సెల్వం తమిళనాడు కొత్త సీఎంగా ప్రమాణం స్వీకారం చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం శశికళ చేసిన ఎత్తులో పన్నీర్ సెల్వం 2017 ఫిబ్రవరి 5న రాజీనామా చేశారు.
కానీ వెంటనే శశికళపై పన్నీర్ సెల్వం తిరుగుబాటు ఉద్యమం లేవనెత్తే సరికి, తమిళనాడులో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. కానీ ఎప్పుడో 20 ఏళ్ల కిందటి ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో శశికళను దోషిగా సుప్రీంకోర్టు తేల్చడంతో ఇక తమిళపీఠం పన్నీర్కే అనుకున్నారు. పన్నీర్పై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన శశికళ వర్గం, ఓ కొత్త అభ్యర్థిని అధికారపార్టీలో రాష్ట్ర రహదారులు, ఓడరేవుల శాఖమంత్రిగా ఉన్న పళనిస్వామిని రంగంలోకి దింపింది. శాసనసభా పక్ష నేతగా కూడా ఆయనే ఎన్నుకుంది. మెజార్జీ సభ్యులు తమకే ఉన్నట్టు శశికళ వర్గం పేర్కొంది.
తనకు 124 మంది ఎమ్మెల్యేల సపోర్టు ఉందని గవర్నర్కు పళనిస్వామి ఓ లేఖ అందించడంతో, ఇక ఆయనకే ప్రభుత్వం ఏర్పాటుచేసుకునేందుకు విద్యాసాగర్ రావు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో తమిళనాడుకు కొత్త సీఎంగా పళనిస్వామి నేటి సాయంత్రం 4 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పళనిస్వామిని 15 రోజుల్లో మెజార్టి నిరూపించుకునేందుకు గవర్నర్ అవకాశమిచ్చారు. ఒకవేళ 15 రోజుల్లో జరిగే బలనిరూపణలో పళనిస్వామి తన మెజార్టి నిరూపించుకోలేకపోతే, మళ్లీ తమిళనాడుకు సీఎం మారే అవకాశాలుంటాయి. ప్రస్తుతమైతే, రెండు నెలల వ్యవధిలో తమిళనాడుకు మూడో సీఎంగా పళనిస్వామి ప్రమాణం చేయబోతున్నారు.
Advertisement