పూంచ్: జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఒక సైనికుడు తన సీనియర్లు ఇద్దరిని కాల్చి చంపి, తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వద్దనున్న సైనిక స్థావరంలో ఆదివారం మధ్యాహ్నం సుమారు 1.15 గంటలకు ఈ సంఘటన జరిగింది. సిపాయి దర్శన్‌లాల్ తొలుత తన సీనియర్ హవల్దార్ రంజోత్ సింగ్‌తో గొడవపడి, అతడిపై కాల్పులు జరిపాడు. అక్కడే ఉన్న జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ సుబేదార్ చెమైల్ సింగ్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా, అతడిపైనా కాల్పులు జరిపాడు. తర్వాత తనను తాను కాల్చుకున్నాడు. ఈ సంఘటనపై సైన్యం కోర్ట్ ఆఫ్ ఇంక్వైరీకి ఆదేశించినట్లు సైనిక ప్రతినిధి ఒకరు చెప్పారు.