ఆ ముగ్గురు ఎవరు?
విదేశాల్లోని బ్యాంకుల్లో భారీగా నల్లధనం దాచుకున్న కొంతమంది కుబేరుల పేర్లను కేంద్ర సర్కారు వెల్లడించడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయయేనని భయపడుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు వణుకుతున్నారు. హస్తం పార్టీకి చెందిన నేతలు పేర్లు ఉన్నాయని కేంద్రం సూచాయగా వెల్లడించడంతో కాంగీయులకు చెమటలు పడుతున్నాయి. యూపీఏ మంత్రి పేరు ఉందని తెలియడంతో వారికి పాలుపోవడం లేదు.
సుప్రీంకోర్టుకు మోదీ సర్కారు సమర్పించిన అఫిడవిట్ లో తన పేరు లేనప్పటికీ కేంద్ర మాజీ మంత్రి ప్రణీత్ కౌర్ తనంతతానుగా బయటకు వచ్చి వివరణ ఇచ్చుకున్నారు. తనకు అసలు విదేశీ ఖాతాలే లేవని వెల్లడించారు. ఆదాయ పన్ను శాఖ నుంచి 2011లో తనకు వచ్చిన నోటీసుకు ఇదే సమాధానం ఇచ్చానని కూడా ఆమె తెలిపారు. ప్రణీత్ కౌర్ భర్త, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ విదేశాల్లో నల్లధనం దాచారని ఎన్నికల ప్రచారంపై బీజేపీ, అకాలీదళ్ ఆరోపించాయి.
కాగా, మరో ముగ్గురు కాంగ్రెస్ నాయకులు పేర్లు 'నల్ల' జాబితాలో ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. వీరిలో ఉత్తరప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ మాజీ పార్లమెంట్ సభ్యుడు కాగా, మహారాష్ట్రలో ప్రముఖ రాజకీయ కుటుంబానికి ఇద్దరు ఉన్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ ముగ్గురు ఎవరై ఉంటారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సంచలనాల కోసం పాకులాడడం మానేసి పూర్తి వివరాలతో నల్లకుబేరులు పేర్లు బయటపెట్టాలని కాంగ్రెస్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది.