
స్వర్ణరథంపై దివ్యతేజోమయి
తిరుచానూరు, న్యూస్‌లైన్: చిత్తూరు జిల్లా తిరుచానూరులోని పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం స్వర్ణరథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. గరుడోత్సవానికి ముందు అమ్మవారిని స్వర్ణరథంపై ఊరేగించడం ఆనవాయితీ. ఉదయం 7 గంటలకు అమ్మవారు సర్వభూపాల వాహనంపై కొలువుదీరి బకాసురుని వధించే శ్రీకృష్ణుని రూపంలో భక్తులను కటాక్షించారు. మధ్యాహ్నం అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 4.30గంటలకు అమ్మవారిని సుందరంగా అలంకరించి రథమండపానికి తీసుకొచ్చి స్వర్ణరథంపై కొలువుదీర్చారు. భక్తుల కోలాటాలు, భజన బృం దాల నడుమ 5 గంటలకు దివ్యతేజోమయి అయిన అమ్మవారు స్వర్ణరథంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. రాత్రి అమ్మవారు గరుడ వాహనంపై ఊరేగారు.
శ్రీవారి దర్శనానికి ఐదు గంటలు
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. రెండు రోజులుగా తిరుమల కొండ ఖాళీగానే ఉంది. బుధవారం వేకువజామున 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 25,678 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 10 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి 5 గంటల్లో స్వామి దర్శనం లభిస్తోంది.