నోట్ల రద్దు ఆర్థిక దోపిడీ
రాహుల్ గాంధీ విమర్శ
అల్మోరా(ఉత్తరాఖండ్): నోట్ల రద్దు నల్లధనంపై యుద్ధం కాదని, అది ఆర్థిక దోపిడీ అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. అల్మోరాలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. 1 శాతం ప్రజలను మరింత ధనవంతులను చేసేందుకు 99 శాతం మంది ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. స్విస్ బ్యాంకులో డబ్బులు దాచుకున్న దొంగల పేర్లు వెల్లడించాలని రాహుల్ ప్రధానిని డిమాండ్ చేశారు. స్విస్ ప్రభుత్వం నల్లధనం కలిగిఉన్నవారి పేర్లను వెల్లడించిందని, వారి పేర్లను లోక్‌సభ, రాజ్యసభల్లో ఎందుకు వెల్లడించలేదని, ప్రశ్నించారు.
అత్యంత ధనికుల రూ. 8 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయడానికే పెద్దనోట్లను రద్దు చేశారన్నారు. నోట్ల రద్దు వల్ల 99 శాతం పేదల నుంచి డబ్బు లాక్కుని 50 ధనిక కుటుంబాలకు కట్టబెడతున్నారని, నగదు రహిత ఆర్థిక వ్యవస్థలో జరిగే ప్రతి ఆన్‌లైన్ లావాదేవీలో 5 శాతం ఆ కుటుంబాలకు వెళ్తుందని ఆరోపించారు. కాగా మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు బిర్లా సంస్థ ముడుపులిచ్చిందన్న రాహుల్ ఆరోపణ గురించి తమకు తెలియదని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం అన్నారు.