ఉద్యోగుల విభజన వేగవంతం చేయిస్తా
తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీలకు కేంద్ర మంత్రి దత్తాత్రేయ హామీ
సాక్షి, న్యూఢిల్లీ: ఉద్యోగుల విభజన ప్రక్రియను వేగవంతం చేయిస్తానని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలంగాణలోని వివిధ ఉద్యోగ సంఘాల జేఏసీల ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఢిల్లీలో మీ ప్రతినిధిగా ఉండి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్, సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రి జితేందర్ సింగ్, కమిటీలు, అధికారులతో సమావేశమై ఉద్యోగుల విభజన ఇంకా ఆలస్యం జరగకుండా సత్వరమే పూర్తిచేయించే బాధ్యత తీసుకుంటానన్నారు.
తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి నేతృత్వంలో 13 ఉద్యోగ సంఘాల జేఏసీల ప్రతినిధులు శుక్రవారం ఇక్కడ మంత్రి దత్తాత్రేయను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటై 14 నెలలు కావస్తున్నా ఉద్యోగుల విభజన అపరిష్కృతంగానే ఉండటం బాధాకరమని, దీనికి గత ప్రభుత్వమే కారణమని దుయ్యబట్టారు. ఆదరా, బాదరాగా విభజన చట్టాన్ని చేసి అనేక సమస్యలు సృష్టించిందని విమర్శించారు.
సంక్లిష్టమైన విషయాలను రాజ్యాంగ బద్ధంగా పరిష్కరించడానికి నైతిక బాధ్యత తీసుకుంటానన్నారు. ఉద్యోగుల విభజనలో ఏపీ, తెలంగాణకు అన్యాయం జరగకుండా చూస్తానని చెప్పారు. టీఎన్జీవో నేతలు శ్రీనివాస్‌గౌడ్, దేవీ ప్రసాద్, రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల విభజనకు సంబంధించి విభజన చట్టంలో ఉన్న మార్గదర్శకసూత్రాలను సవరించాలని డిమాండ్ చేశారు. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన జరగాలని డిమాండ్ చేశారు. కమలనాథన్ కమిటీ కొత్త వివాదాలకు దారితీస్తు తెలంగాణకు నష్టం కలగజేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్రం.. ఉద్యోగుల విభజన సమస్య పరిష్కరించాలని, లేని పక్షంలో మరో ఉద్యమం ఊపిరి పోసుకోనుందని హెచ్చరించారు.
సహకారం ఉంటేనే విభజన..
* ఉద్యోగ సంఘాల నేతలతో అర్చనా వర్మ
రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారం ఉంటేనే రాష్ట్రస్థాయి ఉద్యోగుల విభజన సాధ్యపడుతుందని కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం(డీవోపీటీ) సంయుక్త కార్యదర్శి అర్చనా వర్మ తనను కలిసిన తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలతో స్పష్టం చేశారు. రాష్ట్రస్థాయి ఉద్యోగుల విభజన ప్రక్రియను త్వరితగతిన చేపట్టాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు శుక్రవారం డీవోపీటీ కార్యాలయంలో అర్చనా వర్మను కలసి ఒక వినతిపత్రం ఇచ్చారు.
తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగులను నిరుద్యోగులతో భర్తీ చేయాల్సి ఉండగా.. ఆప్షన్ల పేరుతో ఏపీ ఉద్యోగులను భర్తీ చేసే విధానం సరికాదని, ఉద్యోగుల విభజన ప్రక్రియలో ఆప్షన్లు ఒక ప్రాతిపదికే తప్ప పూర్తిగా అదే ప్రాతిపదికన చేయాలని చట్టం చెప్పలేదని వివరించారు. అయితే ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించిన డీవోపీటీ సంయుక్త కార్యదర్శి స్పందిస్తూ రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటేనే ఉద్యోగుల విభజన సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డట్టు తెలిసింది.