మైనింగ్ అక్రమాలకు ఇక చెక్ | to the check mining irregularities | Sakshi
Sakshi News home page

మైనింగ్ అక్రమాలకు ఇక చెక్

Published Fri, Jan 22 2016 2:39 AM | Last Updated on Sun, Sep 3 2017 4:03 PM

మైనింగ్ అక్రమాలకు ఇక చెక్

మైనింగ్ అక్రమాలకు ఇక చెక్

సాక్షి, హైదరాబాద్: ఖనిజాల వెలికితీతలో అక్రమాలకు అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో ‘ప్రాజెక్ట్ సుదూర్ దృష్టి’కి శ్రీకారం చుట్టినట్లు కేంద్ర గనులశాఖ సంయుక్త కార్యదర్శి సుభాష్ చంద్ర వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పించిన ‘డిజిటల్ ఇండియా’లో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు వివరించారు. కేంద్ర గనులశాఖ పరిధిలోని ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం), నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) గురువారం హైదరాబాద్‌లో ‘ప్రాజెక్టు సుదూర్ దృష్టి’పై పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. ఐబీఎం, ఎన్‌ఆర్‌ఎస్‌సీ అధికారులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గనులశాఖ ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి సుభాష్ చంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిమితంగా ఉన్న సహజ వనరులను బాధ్యతాయుతంగా, సమర్థంగా వినియోగించుకుంటూ సుస్థిర అభివృద్ధి దిశగా అడుగులు వేయాలన్నారు. నూతన సాంకేతికతతో ఖనిజాల వెలికితీతలో అక్రమాలను అరికట్టడం సాధ్యమవుతుందని.. మైనర్ మినరల్స్ వెలికితీతలోనూ ఈ సాంకేతికతను వినియోగించుకునే దిశగా రాష్ట్రాలను ప్రోత్సహిస్తామన్నారు. ఐబీఎం, ఎన్‌ఆర్‌ఎస్‌ఏ ఒప్పందాన్ని చరిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు. శాటిలైట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకోవాలనే ప్రధాని ఆదేశాల మేరకు మూడు నెలల వ్యవధిలోనే 30కిపైగా సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకున్నట్లు ఎన్‌ఆర్‌ఎస్‌సీ డెరైక్టర్ వీకే దద్వాల్ వెల్లడించారు.

1974 మొదలుకుని ఇప్పటి వరకు ఎన్‌ఆర్‌ఎస్‌సీ ఏరియల్ సర్వే ద్వారా అనేక అంశాలపై సమాచారం సేకరించామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు సాంకేతిక సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. గనుల తవ్వకాలను పర్యవేక్షించేందుకు ఐబీఎం అధికారులను రెండు బ్యాచ్‌లుగా విభజించి శిక్షణ ఇస్తున్నామని దద్వాల్ వెల్లడించారు. ఐబీఎం కంట్రోలర్ జనరల్ ఆర్‌కే సిన్హా మాట్లాడుతూ గనుల తవ్వకాల పర్యవేక్షణలో ఇకపై భౌతిక తనిఖీల అవసరం లేకుండా సుదూర్ దృష్టి ప్రాజెక్టు తోడ్పడుతుందన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement