ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాది తహ్సీన్ అక్తర్ అలియాస్ మోనును ఏప్రిల్ 2వ తేదీ వరకు కస్టడీలో ఉంచాలని ఢిల్లీ కోర్టు బుధవారం పోలీసులను ఆదేశించింది. దేశంలోని వివిధ నగరాలలో బాంబు పేలుళ్లతో సంబంధం ఉన్న తహ్సీన్ అక్తర్ను నిన్న ఇండో-నేపాల్ సరిహద్దు డార్జిలింగ్ జిల్లాలోని కకర్విట్టా ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తహ్సీన్ ను దేశ రాజధాని తరలించారు. బుధవారం ఉదయం అతడిని పోలీసులు ఢిల్లీ కోర్టులో హాజరుపరిచారు.
దీంతో అతడికి వచ్చే నెల 2వ తేదీ వరకు న్యాయమూర్తి పోలీసు రిమాండ్ విధించారు. దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లతో సంబంధాలున్న తహ్సీన్ ను ప్రత్యేకంగా విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. దిల్షుక్నగర్ బాంబు పేలుళ్ల కేసులో అక్తర్ మూడో నిందితుడిగా ఉన్న విషయం విదితమే. ఇండియన్ ముజాహిదీన్ సహా వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్తోపాటు మరోకరిని దేశ సరిహద్దుల్లో గతేడాది పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.