180 స్టాళ్లతో.. ట్రెడా ప్రాపర్టీ షో షురూ!
హైదరాబాద్: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 180 స్టాళ్ల ద్వారా తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) స్థిరాస్తి ప్రదర్శన ప్రారంభమైంది. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ప్రారంభమైన ఈ ప్రదర్శనను మంత్రులు జూపల్లి కృష్ణారావు, మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ‘‘టీఎస్ ఐపాస్ తరహాలోనే నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక పాలసీని తీసుకురానున్నట్లు చెప్పారు. దీంతో దేశ, విదేశాలకు చెందిన స్థిరాస్తి సంస్థలకు నగరానికి క్యూ కడతాయని పేర్కొన్నారు. టీఎస్ ఐపాస్ వచ్చాక 15 రోజుల్లో ఫార్మా, తయారీ వంటి సుమారు 250 పరిశ్రమలకు అనుమతులిచ్చామని ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు.
వివిధ దేశాలకు చెందిన ప్రముఖ ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయని.. ఇప్పటికే ఉన్న కంపెనీలు విస్తరణ బాట పట్టనున్నాయని చెప్పారు. దీంతో వచ్చే రెండేళ్లలో హైటెక్ సిటీ ప్రాంతంలో 10 లక్షల ఉద్యోగాలు రానున్నాయని పేర్కొన్నారు. చైనాలో నిర్మాణ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగిస్తారని.. అందుకే అక్కడ వంద అంతస్తుల భవంతిని కేవలం 6 నెలల్లోనే నిర్మించడం సాధ్యమవుతుందన్నారు. అలాంటి నిర్మాణాలు, ఆధునికత భాగ్యనగర నిర్మాణ సంస్థలు చేపట్టాలని సూచించారు. అప్పుడే నగర నిర్మాణ రంగానికి అంతర్జాతీయ స్థాయిలో పేరొస్తుందని తెలిపారు. ఇందులో నగరానికి చెందిన స్థిరాస్తి సంస్థలతో పాటుగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఆర్కిటెక్చర్లు వంటి వారెందరూ పాల్గొన్నారు. నేడు, రేపు కూడా అందుబాటులో ఉంటుంది.
9-10 శాతం ధరలు పెరుగుతాయ్
ప్రస్తుతం నగర స్థిరాస్తి సంస్థలు నాలా పన్ను, ఇంపాక్ట్ ఫీజు, సీనరేజ్ చార్జీలు, పరిపాలన పరమైన సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ విషయమై పలుమార్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాం. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. టీఎస్-ఐపాస్ తరహాలోనే నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక పాలసీని రూపొందించనున్నట్లు సమాచారం. నాలుగేళ్లుగా నగర నిర్మాణ రంగం తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొన్న విషయం వాస్తవమే. కానీ, తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు.. ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ధి చర్యలు, ప్రోత్సాహకరమైన పాలసీలతో స్థిరాస్తి రంగం మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందని నమ్మకం ఉంది. రాష్ట్రంలో నిర్మాణ రంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఫలితంగా వచ్చే ఏడాదిలో హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు 9-10 శాతం మేర పెరుగుతాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కొంత మంది బిల్డర్లు 5 శాతం వరకు స్థిరాస్తి ధరలను పెంచేశారు కూడా.
- ట్రెడా అధ్యక్షుడు పి. దశరథ్‌రెడ్డి