
సైనికులకు ఇక ఏసీ జాకెట్స్
న్యూఢిల్లీ: ఉష్ణోగ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో సేవలందించే స్పెషల్ ఫోర్స్ సైనికులకు ఎయిర్ కండిషన్ (ఏసీ) జాకెట్లను సరఫరా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ఈ జాకెట్లను ఏ మెటీరియల్, టెక్నాలజీతో రూపొందిస్తారనే వివరాలు వెల్లడికాకపోయినా ఈ తరహా జాకెట్లను సైనికులకు సమకూర్చే ప్రతిపాదనను రక్షణ శాఖ మాజీ మంత్రి మనోహర్ పారికర్ నిర్ధారించారు.
ప్రత్యేక బలగాల ఆపరేషన్ సుదీర్ఘంగా సాగే ప్రక్రియ కావడంతో సైనికుల శరీరం వేడెక్కే అవకాశం ఉండటంతో వారికి తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. ఆ సమయంలో సైనికులు ఏసీ జాకెట్ ధరిస్తే వారికి ఎంతో సౌకర్యంగా ఉంటుందని పారికర్ పేర్కొన్నారు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ప్రస్తుత గోవా సీఎంగా ఉన్న పారికర్ ఆదివారం పనాజీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు. అమెరికన్ సైనికులు ఇప్పటికే ఇలాంటి జాకెట్స్ వాడుతున్నారు. దుస్తుల్లో చిన్న బ్యాటరీని అమర్చడం ద్వారా సైనికుల శరీరం వేడెక్కకుండా ఈ జాకెట్లను అమెరికా రక్షణ శాఖ సైనికులకు సమకూర్చింది.