సౌండ్ పెద్దగా పెట్టాడని చంపేశారు
ఇండోర్: మొబైల్ ఫోన్లో సౌండ్ ఎక్కువగా పెట్టుకుని పాటలు వింటున్నందుకు ఓ గిరిజన యువకుడిని కిరాతకంగా చంపేశారు. 15 మంది అగ్రవర్ణాలకు చెందిన వారు అతణ్ని తీవ్రంగా కొట్టి సజీవ దహనం చేశారు. మధ్యప్రదేశ్లోని ధర్ జిల్లా అచ్చోడ అనే గ్రామంలో గత ఆగస్టు 15న జరిగిన ఈ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ కేసును విచారణకు స్వీకరించింది. ధర్ జిల్లా ఎస్పీ, మనావర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్కు సమన్లు జారీ చేసింది. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాల్సిందిగా ఇండోర్ బెంచ్ జస్టిస్ ఎస్ ఆర్ వాఘ్మరే ఆదేశించారు.
మృతుడి సోదరుడు అబాన్.. జాగృత్ దళిత్ ఆదివాసి సంఘతన్ సాయంతో పిటిషన్ను దాఖలు చేశాడు. అగ్రవర్ణాలకు చెందిన యువకులు.. మొబైల్లో మ్యూజిక్ సౌండ్ను తగ్గించుకోవాల్సిందిగా తన సోదరుడికి చెప్పారని, వారి మాట విననందుకు గొడవ పెట్టుకున్నారని చెప్పాడు. అనంతరం యువకులు గ్రామ సేవాదళ్తో కలసి వచ్చి తన సోదరుడిని చంపేసి, తమ ఇంటికి ఎదురుగా చెట్టుకు వేళాడతీశారని పిటిషన్లో పేర్కొన్నాడు. ఈ విషయాన్ని బయటకు చెప్పరాదని గ్రామస్తులు బెదిరించారని తెలిపాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేసుకోలేదని చెప్పాడు.