షాపింగ్ జోరులో టీఆర్‌ఎస్
పీసీసీ నేతలతో భేటీ అనంతరం మీడియాతో దిగ్విజయ్
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో స్థానికంగానే పొత్తులు
సాక్షి, న్యూఢిల్లీ: ‘టీఆర్‌ఎస్ పార్టీ ఇప్పుడు షాపింగ్ జోరులో ఉంది. అభ్యర్థులనే కొనుగోలు చేస్తోంది. వాళ్ల షాపింగ్ జాబితాలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైఎస్సార్‌సీపీ అందరూ ఉన్నారు’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ విపక్షాల అభ్యర్థులను కొనుగోలు చేస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. సోమవారం ఇక్కడి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజుతో కలసి ఆయన ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో, తదుపరి తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కె.జానారెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్‌అలీ, సునితా లక్ష్మారెడ్డి, దానంనాగేందర్, కె.మల్లేశ్ తో సమావేశమయ్యారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఎమ్మెల్సీ ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల వ్యవహారంపై చర్చించారు. అనంతరం దిగ్విజయ్ మీడియాతో మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పొత్తులపై ఇప్పటివరకు ఏమీ అనుకోలేదని, ఎంఐఎం టీఆర్‌ఎస్‌తో జతకట్టిందని, ఎంబీటీ చిన్న పార్టీ అని, పొత్తుల విషయంలో స్థానికంగానే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. చండీయాగంపై స్పందిస్తూ ‘ఇప్పటికే టీఆర్‌ఎస్ అధికారంలో ఉంది. ఇంకా ఏం కావాలనుకుంటున్నారు? చంద్రబాబు సపోర్‌ట కూడా తీసుకుంటున్నారు..’ అని వ్యాఖ్యానించారు.
హైకోర్టు విభజనపై ఎందుకు అడగలేదు: యాష్కీ
హైకోర్టు విభజనపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ సీఎంతో ఎందుకు మాట్లాడలేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కీగౌడ్ ప్రశ్నించారు. ‘విజయవాడ వెళ్లిన ముఖ్యమంత్రి రొయ్యలు తిన్నడట. ఉలవచారు తిన్నడట. కానీ హైకోర్టు విభజనపై అడగలేదట. ముఖ్యమంత్రులు కలసి పరిష్కరించుకోవాల్సిన విభజన అం శాన్ని పక్కనపెట్టి.. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు సమీస్తున్న నేపథ్యం లో ఓట్ల కోసం చంద్రబాబుతో కలసి తిరుగుతున్నరు.’ అని ఆయన వ్యాఖ్యానించారు.
సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతిలో ఎంపిక: ఉత్తమ్
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గతంలో సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ‘దిగ్విజయ్ వద్ద పలు అంశాలు చర్చించాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్న తీరును వివరించాం. గతంలోలాగే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గతంలో సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతిని ఎంచుకున్నాం. ఎక్కడైనా వివాదం ఉంటే పీసీసీ జోక్యం చేసుకుంటుంది. తక్షణమే ప్రచార కార్యక్రమం మొదలుపెట్టాలని నిర్ణయించాం. ఐకమత్యంగా జీహెచ్‌ఎంసీలో అత్యధిక స్థానాలను గెలుచుకుంటాం..’ అని ఆయన ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.