పండగే.. పండగ! | 'Native' representatives on demand | Sakshi
Sakshi News home page

పండగే.. పండగ!

Published Thu, Dec 3 2015 3:22 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

పండగే.. పండగ! - Sakshi

పండగే.. పండగ!

♦ ‘స్థానిక’ ప్రతినిధులకు పెరిగిన డిమాండ్
♦ ఎమ్మెల్సీ అభ్యర్థుల నుంచి తాయిలాలు
♦ ఆయా పార్టీల నుంచి మొదలైన ప్రలోభాలు
♦ ముందే ఓట్లు రిజర్వు చేసుకుంటున్న వైనం
♦ చేతులు మారనున్న కోట్లాది రూపాయలు
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో కోలాహలం మొదలైంది. ‘స్థానిక’ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలతో వారికి ఇప్పుడు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ విడుదలకాగా.. 27న పోలింగ్ జరగనుంది. ఆయా రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే ఓట్లను రిజర్వు చేసుకోవడం మొదలుపెట్టాయి. వాస్తవానికి ఇంకా ఏ పార్టీలోనూ అభ్యర్థులు ఖరారు కాలేదు. కాకపోతే, ఏ జిల్లాలో ఏ పార్టీ తరఫున ఎవరు పోటీ చేసే అవకాశముందో కొంత స్పష్టత ఉంది. అధికారికంగా తమను అభ్యర్థులుగా ప్రకటించకున్నా, టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లో టికెట్ దక్కుతుందన్న విశ్వాసమున్న నేతలు రెండు, మూడు నెలల కిందటే రంగంలోకి దిగారు. కేవలం స్థానికప్రజాప్రతినిధులైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మాత్రమే ఓటర్లుగా ఉండే ఈ ఎన్నికల్లో ఓట్లు చాలా పరిమితం. రాష్ట్రవ్యాప్తంగా 8,400పైచిలుకు స్థానిక ప్రజాప్రతి నిధులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

 రెండు వైపుల నుంచి సొమ్ములు
 కాంగ్రెస్ కొన్ని సీట్లనైనా దక్కించుకునేందుకు దక్షిణ తెలంగాణ జిల్లాలపైనే ఆశలు పెట్టుకుంది. టీడీపీ పోటీచేయాలని భావిస్తున్న స్థానాలూ దక్షిణ తెలంగాణలోనే ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి టికెట్ ఖరారవుతుందని భావిస్తున్న కొందరు నేతలు ఇప్పటికే పంపకాలు మొదలుపెట్టారని సమాచారం.  ఇటు కాంగ్రెస్ నుంచి అటు టీఆర్‌ఎస్ నుంచి కూడా వీరికి డబ్బులు ముట్టినట్లు చెబుతున్నారు. పోటీ తీవ్రంగా ఉంటుందని భావిస్తున్న నల్లగొండ జిల్లాలో పరిస్థితి ఆసక్తికరంగా ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి ఒక్కో ఓటుకు రూ.2 లక్షలు చెల్లించేందుకు నిర్ణయించారని, ఓటుకు రూ.3 లక్షలు ఇద్దామని టీఆర్‌ఎస్‌కు చెందిన నేత ఒకరు సన్నిహిత వర్గాల వద్ద చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఇద్దరు నేతలు ఓట్ల కోసం ఒక్కో ప్రతినిధికి రూ.లక్ష చొప్పున పంచినట్లు తెలిసింది. టీఆర్‌ఎస్‌కు ఓట్లు తక్కువ ఉన్నాయని భావిస్తున్న ఖమ్మం జిల్లాలోనూ బేరసారాలు మొదలయ్యాయని, ఖర్చులు భరించే అభ్యర్థి వెదుకులాటలో అధికార పార్టీ బిజీగా ఉందని అంటున్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోనూ ఓట్ల కొనుగోలు తప్పకపోవచ్చన్న అభిప్రాయం బలంగా ఉంది.
 
 టీఆర్‌ఎస్ x కాంగ్రెస్
 ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్యనే కొనసాగనుంది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కో స్థానానికి టీటీడీపీ పోటీపడే అవకాశముంది. ఈ రెండు స్థానాల్లో త్రిముఖ, మిగిలిన పది స్థానాల్లో ద్విముఖ పోటీకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతీజిల్లాలో టీడీపీ, బీజేపీ, వామపక్షాలు, వైఎస్సార్ కాంగ్రెస్‌కు స్థానికసంస్థల్లో ప్రాతినిధ్యం ఉంది. పలువురు కాంగ్రెస్, టీడీపీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోగా, మిగిలినవారి ఓట్లపైనే ఈ  పార్టీలు ఆధారపడుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయని ఇతర పక్షాల ఓట్లకు ఇప్పుడు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కోట్లాది రూపాయలు చేతులు మారడానికి రంగం సిద్ధమైంది.  ఒక పార్టీ ఓట్లను మరో పార్టీ కొల్లగొంటేందుకు స్థానిక ప్రజాప్రతినిధులకు గాలం వేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement