ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం(ఈవీఎం)లోని పై వారెవరూ కాదు(నన్ ఆఫ్ ది అబౌ-నోటా) అనే బటన్ రంగును మార్చాలని టీఆర్‌ఎస్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు
ఈవీఎంలో నోటా రంగు మార్చండి: టీఆర్ఎస్
Published Fri, Dec 20 2013 11:25 PM | Last Updated on Thu, Jul 11 2019 8:26 PM
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం(ఈవీఎం)లోని పై వారెవరూ కాదు(నన్ ఆఫ్ ది అబౌ-నోటా) అనే బటన్ రంగును మార్చాలని టీఆర్‌ఎస్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎంపీ వివేక్, మాజీ ఎంపీ వినోద్‌లు శుక్రవారం ఢిల్లీలోని నిర్వాచన్ సదన్‌లో కేంద్ర ఎన్నికల కమిషనర్ బ్రహ్మను కలిసి వినతిపత్రం అందజేశారు. నోటా బటన్ గులాబీ రంగులో ఉందని, తమ పార్టీ జెండా రంగు(అందులో ఉండే ఎన్నికల గుర్తు కారు) కూడా గులాబీయే అని, దీనివల్ల నిరక్షరాస్యులైన ఓటర్లు గులాబీ రంగులో ఉన్న ‘నోటా’ బటన్‌ను నొక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారు వివరించారు.
రాబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా కొనసాగడానికి వీలుగా నోటా బటన్‌కు గులాబీ రంగుకు బదులుగా మరేదైనా రంగును ఉపయోగించాలని సూచించారు. టీఆర్‌ఎస్ నేతల అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన కేంద్ర ఎన్నికల కమిషనర్ బ్రహ్మ... ఆ మేరకు అధికారులకు సూచనలు చేశారు. తమ వినతికి బ్రహ్మ సానుకూలంగా స్పందించారని, ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని టీఆర్‌ఎస్ నేతలు మీడియాకు తెలిపారు.
Advertisement
Advertisement