పిలిచి మరీ జర్నలిస్టులను తిట్టిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఎలక్రానిక్ మీడియా ప్రముఖులు, జర్నలిస్టులను పిలిచిమరీ తిట్టిపోశారు. జర్నలిస్టులు నిజాయితీలేని వ్యక్తులనీ, వంచకులు, అబద్ధాలకోరులనీ ట్రంప్ ధ్వజమెత్తారు. న్యూయార్క్‌లో సోమవారం మీటింగ్ ఆఫ్ మైండ్స్ పేరిట సమావేశానికి పిలిచి మరీ ట్రంప్ ఇలా తిట్టిపోయడంతో విస్తుపోవడం విలేకరుల వంతయింది.
‘ఎన్నికల గెలుపు నేపథ్యంలో మీడియాతో సామరస్య ధోరణి ట్రంప్ అవలంబిస్తారని భావించినప్పటికీ, అందుకు విరుద్ధంగా ఎదురుదాడి ధోరణిని ఆయన ప్రదర్శించారు’ అని ఈ భేటీలో పాల్గొన్న పలువురు పాత్రికేయులు తెలిపినట్టు వాషింగ్టన్ పోస్టు తెలిపింది.
‘ప్రేక్షకులకు పారదర్శకమైన, కచ్చితమైన సమాచారం అందజేయడంలో మీరు విఫలమయ్యారు. నన్ను, నేను లక్షలాది అమెరికన్లకు చేసిన విజ్ఞప్తులను అర్థం చేసుకోవడంలో మీరు విఫలమయ్యారు’ అంటూ తన ముందు కాన్ఫరెన్స్ టేబుల్ చుట్టూ కూర్చున్న పాత్రికేయులను ఉద్దేశించి ట్రంప్ తీవ్ర స్వరంతో అన్నారు’ అని వాషింగ్టన్‌పోస్టు తెలిపింది. ఎన్నికల ప్రచారాన్ని కవరేజ్ చేయడంలో పక్షపాతపూరితంగా, బూటకంగా వ్యవహరించారని పదేపదే తీవ్రస్వరంతో ట్రంప్ గద్దించినట్టు పేర్కొంది.