అంత తొందరెందుకు?
సాక్షి, హైదరాబాద్: గుంటూరు జిల్లా తుళ్లూరులో తాత్కాలిక శాసనసభ భవనాలను శాశ్వత భవనాల నిర్మాణం పూర్తయ్యేవరకు నిలబడేలా చేపట్టాల్సిందిగా పలువురు నేతలు సూచించారు. హడావుడిగా నిర్మాణాలు చేపట్టవద్దన్నారు. పదేళ్లపాటు హైదరాబాద్‌లోనే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించుకునే అవకాశం ఉండగా తొందరపాటు ఎందుకనే అభిప్రాయం వ్యక్తమైంది. హైదరాబాద్‌ను వదిలి వెళ్లిపోతున్నారనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లే అవకాశముందని చెప్పారు. తాత్కాలిక నిర్మాణాలకు ఎంత ఖర్చవుతుందో అంచనా వేసి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
తుళ్లూరులో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు శుక్రవారం తన చాంబర్లో వివిధ పార్టీల శాసనసభాపక్ష నేతల సమావేశం నిర్వహించారు. శాసనసభాపక్ష నేతలు ఎవరూ హాజరుకాలేదు. మండలి చైర్మన్ డాక్టర్ ఏ.చక్రపాణి, శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, మండలిలో వివిధపక్షాల నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (వైఎస్సార్‌సీపీ), విఠాపు బాలసుబ్రహ్మణ్యం (పీడీఎఫ్), పీజే చంద్రశేఖర్ (సీపీఐ), శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, విప్ మేడా మల్లికార్జునరెడ్డి, రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహనరావు, అధికారులు, శాసనసభ ఇన్‌చార్జి కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
స్పీకర్ కోడెల మాట్లాడుతూ ఏపీ పరిపాలనా యంత్రాంగం కొత్త రాజధానికి తరలిపోతున్న నేపథ్యంలో శీతాకాల సమావే శాలు అక్కడ నిర్వహించుకుంటే శాసనసభ కూడా తరలివస్తోందని ప్రజల్లోకి సందేశం పంపినట్లు అవుతుందని సీఎం అభిప్రాయపడ్డారని చెప్పారు. ఉమ్మారెడ్డి మాట్లాడుతూ డిసెంబర్‌లో ఐదురోజుల పాటు సమావేశాలు నిర్వహించాలంటే ఇప్పుడే నిర్మాణాలు చేపట్టి పూర్తి చేయాల్సి ఉంటుందని, కేవలం ఐదురోజుల సమావేశాల కోసం హడావుడిగా నిర్మాణాలు చేపట్టడం సరికాదని చెప్పారు.
శీతాకాల, వచ్చే బడ్జెట్ సమావేశాలు హైదరాబాద్‌లో నిర్వహించాలని, ఈలోగా కొత్త అసెంబ్లీ భవన నిర్మాణాలు పూర్తయ్యేవరకు ఉండేలా తాత్కాలిక నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. సమావేశం అనంతరం స్పీకర్ కోడెల మీడియాతో మాట్లాడుతూ సీఎం ఆమోదానికి లోబడి సభ నిర్వహణపై తుది నిర్ణయం ఉంటుందన్నారు.
అఖిలపక్షం ఆమోదం: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రాజధాని ప్రాంతంలో నిర్వహణకు అఖిలపక్షం ఆమోదం తెలిపిందని స్పీక ర్ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజాభీష్టం మేరకు సమావేశాలు ఏపీ భూభాగంలో నిర్వహిస్తే బాగుంటుందన్న సభాపతి సూచనకు రాజకీయపక్షాలు తమ అంగీకారాన్ని తెలిపాయని పేర్కొంది.