వ్యాసం రాయమంటే.. తను ఏం రాసిందో తెలుసా?
పట్నా: ఎవరైనా వ్యాసం రాయమంటే.. ఏం చేస్తారు. ఇచ్చిన అంశంపై తమకు తెలిసిన పదో పదిహెనో పంక్తులు రాస్తారు. కానీ భక్త కవి తులసి దాస్‌పై వ్యాసం రాయమని కోరినప్పుడు బిహార్ ఇంటర్ బోర్డు టాపర్ రుబీ రాయ్ మాత్రం రెండంటే రెండు పదాలు రాసింది. ‘తులసీ దాస్ జీ ప్రణామ్’ అంటు రెండు పదాలు రాసి వ్యాసం ముగించింది.
బిహార్‌ను కుదిపేస్తున్న 12వ తరగతి టాపర్ కుంభకోణంపై విచారణలో భాగంగా రుబీరాయ్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అరెస్టు చేయడానికి ముందు ఆమె మరోసారి నిపుణుల ఎదుట పరీక్షకు హాజరైంది. ఈ పరీక్షలో భాగంగా నిపుణులు ఆమెను భక్త కవి తులసీదాస్‌పై వ్యాసం రాయాల్సిందిగా కోరారు. అయితే, రుబీరాయ్ మాత్రం తాను రెండేళ్లు ఎంతో కష్టపడి చదివానని, కానీ, తనకిప్పుడు ఏమీ గుర్తులేదని నిపుణులకు తెలిపింది. హ్యుమానిటిస్ గ్రూప్‌లో ఆమెకు వచ్చిన మార్కులు అక్రమార్గంలో వచ్చినవేనని నిపుణుల బృందం నిర్ధారించిందని, దీంతో ఆమె ఫలితాలను రద్దు చేశామని బిహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు (బీఎస్‌ఈబీ) చైర్మన్ ఆనంద్ కిషోర్ తెలిపారు.
బోర్డ్ ఫలితాల్లో టాప్ ర్యాంకు తెచ్చుకున్న రుబీ రాయ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో రాజనీతి శాస్త్రం (పొలిటికల్ సైన్స్) అంటే వంటలకు సంబంధించినదని పేర్కొనడం సంచలనం సృష్టించింది. కనీస అవగాహన కూడా లేని ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూతో ర్యాంకర్ల అసలు బండారం బట్టబయలైంది. దీంతో వివిధ కోర్సుల్లో టాప్ ర్యాంకులు తెచ్చుకున్న మొత్తం 14 మంది విద్యార్థులకు బీఎస్ఈబీ బోర్డు నిపుణులతో మళ్లీ మౌఖిక పరీక్షలు నిర్వహించింది. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడినట్టు రుజువుకావడంతో పలువురి ర్యాంకులను రద్దుచేసింది. ఈ టాపర్స్ కుంభకోణంపై సిట్ దర్యాప్తు నిర్వహిస్తోంది.