'బలి చేశారు.. నేనేంటో నిరూపించుకుంటా'
పాట్నా: తానేంటో నిరూపించుకుంటానని మాస్ కాపీయింగ్కు పాల్పడి స్టేట్ టాపర్ గా వచ్చి అనంతరం అరెస్టయినబిహార్ స్కూల్ బోర్డు ఆర్ట్స్ టాపర్ రూబీ రాయ్ చెప్పింది. తాను న్యాయవాదిని అవుతానని, లేదంటే ఒక అధికారిగా మారతానని చెప్పింది. బిహార్ స్కూల్ బోర్డు పరీక్షల్లో ఆర్ట్స్ విభాగంలో పరీక్షలు రాసిన రూబీ టాపర్ గా వచ్చింది. అయితే, ఓ మీడియా చేసిన ఇంటర్వ్యూలో పొలిటికల్ సైన్స్ వంటల గురించి చెబుతుందని చెప్పి అవాక్కయ్యేలా చేసింది. అనంతరం చేసిన విచారణలో రూబీతో సహా కొందరు విద్యార్థులు భారీ ఎత్తున మాస్ కాపీయింగ్ పాల్పడ్డారని తెలిసింది.
దీంతో ఆ విద్యార్థినిని మరికొందరిని అరెస్టు చేసిన అధికారులు ఏడు వారాలపాటు జైలులో ఉంచారు. రిమాండ్ పూర్తి చేసుకొని ఇంటికొచ్చిన సందర్భంగా రూబీ మీడియాతో మాట్లాడుతూ 'నా జీవితంలో జరిగిన ఈ సంఘటన నా ఆలోచన విధానాన్ని మార్చింది. నేను ఇక చదువులపై శ్రద్ధపెడతాను. న్యాయవాదిగానో అధికారిగానో మారతాను. ఇప్పటి వరకు ఏం జరిగిందో అదంతా ముగిసిన గతం. నేను కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. నన్ను నేను నిరూపించుకునేందుకు బాగా కష్టపడాలనుకుంటున్నాను. నీ జీవితంలో ఇప్పుడు ఏం జరిగిందో అది మర్చిపోతాను. నేను అమాయకురాలిని. ఎవరో చేసిన కుట్రకు నేను బలయ్యాను. నన్ను ఎందుకు డిటెండ్ చేశారో.. రిమాండ్ కు ఎందుకు పంపించారో నాకు తెలియదు. స్కాంకు పాల్పడినవారికి నాకు ఏం సంబంధం లేదు' అని ఆ విద్యార్థిని చెప్పింది.