బిహార్‌లో మరో టాపర్స్ స్కామ్!
పాట్నా: గతేడాది తరహాలోనే మరోసారి బిహార్ రాష్ట్రంలో టాపర్ల కుంభకోణం వెలుగుచూసింది. ప్లస్ టు ఫలితాలు విడుదలైన రోజు నుంచి టాపర్‌గా నిలిచిన గణేష్ కుమార్ కనిపించకుండా పోయాడు. ప్లస్ టు టాపర్ గణేష్ అదృశ్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 24 ఏళ్ల వయసులో గణేష్ కుమార్ ఈ పరీక్షలకు హాజరైన విషయం తెలిసిందే. మరోవైపు గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టాపర్స్ స్కామ్ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కొనసాగిస్తోంది.
తన కూతురు టాపర్‌గా నిలవాలని ఆశపడి అడ్డదారి తొక్కినందుకు గతేడాది బిహార్ ప్లస్ టూ టాపర్ రుబీ రాయ్ తండ్రి అవదేశ్ రాయ్ ని భగవాన్ పూర్ లో గతంలోనే అరెస్ట్ చేసి విచారించారు. బిహార్ బోర్డ్ ఫలితాల్లో టాప్ ర్యాంకు తెచ్చుకున్న రుబీ రాయ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో రాజనీతి శాస్త్రం (పొలిటికల్ సైన్స్) అంటే వంటలకు సంబంధించినదని, వంటలు ఎలా చేయాలో నేర్చుకోవచ్చునని పేర్కొనడంతో టాపర్స్ స్కామ్ వెలుగుచూసింది.
ఒక్క అక్షరం ముక్క రాకున్నా తమ పిల్లలు స్టేట్ టాపర్లుగా నిలిచేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు రూ.20 లక్షలు ముట్టజెప్పినట్లు బీఎస్ఈబీ చైర్మన్ లల్కేశ్వర్ ప్రసాద్ సింగ్ స్వయంగా అంగీకరించారు. టాప్ ర్యాంకులు తెచ్చుకున్న మొత్తం 14 మంది విద్యార్థులకు బీఎస్ఈబీ బోర్డు నిపుణులతో మళ్లీ మౌఖిక పరీక్షలు నిర్వహించగా కొందరు విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా మరికొందరు ఎగ్జామ్ అంటేనే భయపడిపోయి ఇంటివద్దే ఉండిపోయారు. భక్త కవి తులసీదాస్‌పై వ్యాసం రాయాలని చెప్పగా.. టాపర్ రుబీ రాయ్ మాత్రం 'తులసీదాస్ జీ ప్రణామ్' అంటూ కేవలం రెండు పదాలతో వ్యాసం ముగించిడం గమనార్హం. తాజాగా బిహార్ ప్లస్ టు టాపర్ గణేష్ అదృశ్యంతో గతేడాది తరహాలోనే మరో టాపర్స్ స్కామ్ వెలుగుచూసింది.