టాపర్ అరెస్ట్.. ఆశ్చర్యకర నిజాలు బహిర్గతం | Bihar Class 12 arts topper Ganesh Kumar arrested by patna police | Sakshi
Sakshi News home page

టాపర్ అరెస్ట్.. ఆశ్చర్యకర నిజాలు బహిర్గతం

Published Sat, Jun 3 2017 5:03 PM | Last Updated on Tue, Sep 5 2017 12:44 PM

టాపర్ అరెస్ట్.. ఆశ్చర్యకర నిజాలు బహిర్గతం

టాపర్ అరెస్ట్.. ఆశ్చర్యకర నిజాలు బహిర్గతం

పాట్నా: గతేడాది తరహాలోనే మరోసారి బిహార్ రాష్ట్రంలో టాపర్ల కుంభకోణం మరోసారి కలకలం రేపింది. ఇటీవల విడుదలలైన ప్లస్ టు ఫలితాలలో ఆర్ట్స్ లో స్టేట్ టాపర్ గా నిలిచిన గణేష్ కుమర్ ను పాట్నా పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసి, కోత్వాలి పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసుల విచారణలో పలు ఆశ్చర్యకర విషయాలు వెలుగుచూశాయి.

ప్లస్ టు ఫలితాలు విడుదలయ్యాక అదృశ్యమైన గణేష్ ను అదుపులోకి తీసుకున్నట్లు పాట్నా ఎస్ఎస్పీ మను మహరాజ్ తెలిపారు.  టెన్త్, ప్లస్ టు పరీక్షలకు రెండోసారి హాజరయ్యేందుకు గణేష్ తన వయసు, ఇతర వివరాలను తప్పుగా నమోదు చేశాడని బిహార్ పరీక్షల బోర్డు చైర్మన్ ఆనంద్ కిషోర్ వెల్లడించారు. అతడి సర్టిఫికేట్లను అధికారికంగా రద్దు చేస్తున్నట్లు చెప్పారు.

పుట్టినతేదీ, పేరు మార్చేశాడు
వాస్తవానికి అందరూ అనుకున్నట్లుగా ఆర్ట్స్ టాపర్ వయసు 24 ఏళ్లు కాదని, అసలు వయసు 41 ఏళ్ల పైమాటే. గణేష్ టెన్త్, ప్లస్ టు పరీక్షలు రెండుసార్లు రాశాడు. గణేష్ కుమార్ అసలు పేరు గణేష్ రామ్. అతడు పుట్టిన తేదీ నవంబర్ 7, 1975 కాగా, 1990లో అవిభాజ్య బిహార్ (ఇప్పటి ఝార్ఖండ్) లోని గిరిధ్ జిల్లా సురియా.. సీఆర్ ఎస్ఆర్ పాఠశాలలో గణేష్ రామ్ పేరుతో 1990లో టెన్త్ ఎగ్జామ్స్ రాశాడు. అనంతరం ప్లస్ టూ పరీక్షలకు హాజరయ్యాడు. 2015లో సమస్తిపూర్ లోని సంజయ్ గాంధీ ఉన్నత పాఠశాల విద్యార్థిగా గణేష్ కుమార్ పేరుతో టెన్త్ ఎగ్జామ్స్ రాశాడు. గణేష్ పుట్టినతేదీ జూన్ 2, 1993గా స్కూలు రికార్డులో ఉన్నట్లు గుర్తించినట్లు బీఎస్ఈబీ చైర్మన్ ఆనంద్ కిషోర్ చెప్పారు.

చిన్న ప్రశ్నలకు నోరు తెరవలేదు
సమస్తిపూర్ లోని జగదీప్ నారాయణ్ కాలేజీ్ విద్యార్థిగా ఈ ఏడాది ఆర్ట్స్ పరీక్షలు రాసిన గణేష్ హిస్టరీ, సోషియాలజీలలో 80 మార్కులు, హిందీలో 92, సైకాలజీలో 59, లాంగ్వేజ్ పేపర్లో 78, మ్యూజిక్(ప్రాక్టికల్స్) లో 70 మార్కులకు గానూ 65, థియరీలో 30కి 18 మార్కులు స్కోరు చేశాడు. అయితే అత్యధిక స్కోరు సాధించిన సబ్జెక్ట్స్ నుంచి చిన్న చిన్న ప్రశ్నలకు కూడా గణేష్ జవాబివ్వక పోవటంతో ఓ నిర్ధారణకొచ్చారు. గణేష్ రెండోసారి టెన్త్, ఇంటర్ చదివిన విద్యాసంస్థలకు నోటీసులు జారీ చేశామని, టాపర్ చీటింగ్ పై వివరణ ఇచ్చేందుకు మూడు రోజుల గడువు ఇచ్చారు. సరైన వివరణ ఇవ్వని పక్షంలో విద్యాసంస్థల గుర్తింపు రద్దుచేస్తామని బీఎస్ఈబీ చైర్మన్ హెచ్చరించారు.

గణేష్ సొంతంగానే పరీక్ష రాశాడని, ఇందులో ఆన్సర్ షీట్లలో ఉన్నది టాపర్ చేతిరాతని తేల్చారు. ఏదో విధంగా స్టేట్ టాపర్ కావాలని భావించి గణేష్ ఈ మోసానికి పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఏడాది ఫలితాలలో గతేడాది టాపర్స్ స్కామ్ ప్రభావం కనిపించింది. ఈ ఏడాది 12వ తరగతి (ఇంటర్) పరీక్షలలో కేవలం 36 శాతం మాత్రమే ఉత్తీర్ణులైన విషయం తెలిసిందే.  అన్ని అంశాల్లోను చాలా కఠినంగా వ్యవహరించామని, పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అవినీతికి ఆస్కారం లేకుండా చూసుకున్నామని ఆనంద్ కిషోర్ ఇటీవల ఓ ప్రకటనలో వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement