బిహార్ టాపర్ రుబిరాయ్ అరెస్టు
పట్నా: బిహార్‌ను కుదిపేసిన ఇంటర్ బోర్డు టాపర్ల స్కాం కీలక పరిణామం చోటుచేసుకుంది. 12వ తరగతి (ఇంటర్) బోర్డు ఫలితాల్లో నంబర్ ర్యాంకు తెచ్చుకున్న రుబీ రాయ్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టుచేశారు. బోర్డ్ ఫలితాల్లో టాప్ ర్యాంకు తెచ్చుకున్న రుబీ రాయ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో రాజనీతి శాస్త్రం (పొలిటికల్ సైన్స్) అంటే వంటలకు సంబంధించినదని పేర్కొనడం సంచలనం సృష్టించింది. కనీస అవగాహన కూడా లేని ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూతో ర్యాంకర్ల అసలు బండారం బట్టబయలైంది.
దీంతో వివిధ కోర్సుల్లో టాప్ ర్యాంకులు తెచ్చుకున్న మొత్తం 14 మంది విద్యార్థులకు బీఎస్ఈబీ బోర్డు నిపుణులతో మళ్లీ మౌఖిక పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలకు డుమ్మా కొట్టడంతో రుబీ రాయ్ తాజాగా మరోసారి పరీక్షలకు హాజరైంది. మౌఖిక పరీక్షలు పూర్తయిన తర్వాత టాస్క్ ఫోర్స్ ఆమెను అదుపులోకి తీసుకుంది.
బిహార్‌లో పరీక్షలంటేనే మాస్ కాపీయింగ్ కు మారుపేరు. ఈ నేపథ్యంలో టాపర్లతో ఓ టీవీ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో వారి బండారం బయటపడింది. మారుపేర్లతో పరీక్షలు రాయించడమో లేక ఎగ్జామినర్లతో కుమ్మక్కవ్వడం వల్లనో వీరు టాప్ ర్యాంకులు సాధించినట్టు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాపర్ కుంభకోణంపై బిహార్ ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించింది.