
ప్రదీప్ మృతి: శ్రావణ్ ఎవరు?
హైదరాబాద్: ప్రముఖ టీవీ నటుడు ప్రదీప్ మృతి నేపథ్యంలో శ్రావణ్ అనే వ్యక్తిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత రెండు నెలలుగా ప్రదీప్ ఇంట్లోనే శ్రావణ్ ఉంటున్నట్టు తెలుస్తోంది. ప్రదీప్ భార్య పావనీరెడ్డి తనతో శ్రావణ్ చనువుగా ఉన్న ఫొటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టడంతో ఇద్దరి మధ్య విభేదాలు మొదలైనట్టు చెప్తున్నారు. ప్రదీప్ కుటుంబసభ్యులు పావనీరెడ్డి తీరుపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రదీప్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అంటున్నారు. ప్రదీప్‌ది ఆత్మహత్య అయితే ఇంట్లో అద్దాలు ఎందుకు పగిలిపోయాయని వారు ప్రశ్నిస్తున్నారు.
ప్రదీప్ అనుమానాస్పద మృతి వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రావణ్ ఎట్టకేలకు స్పందించాడు. గత రాత్రి తన పుట్టినరోజు కావడంతో తాము పార్టీ చేసుకున్నామని, పార్టీ మధ్యలోనే ప్రదీప్ బయటకు వెళ్లివచ్చాడని చెప్పాడు. గంటన్నర తర్వాత ప్రదీప్ తిరిగి ఇంటికి వచ్చాడని, తెల్లారిసరికి అతను గదిలో ఆత్మహత్య చేసుకొని కనిపించాడని చెప్పారు. పావనితో తనకున్నది అన్నాచెల్లెళ్ల అనుబంధమని, తనపై విమర్శలు రావడం బాధ కలిగిస్తున్నదని తెలిపాడు. మరోవైపు ప్రదీప్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. అతని మృతదేహాన్ని పుప్పాలగూడలోని ఇంటికి తరలించారు.