కాబూల్‌ను వణికించిన జంటపేలుళ్లు, పలువురి మృతి
Published Tue, Jan 10 2017 6:34 PM | Last Updated on Thu, Mar 28 2019 6:10 PM
అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. ఏకంగా జాతీయ పార్లమెంటు సమీపంలోనే జంట పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ పేలుళ్లలో సుమారు 50 మందికి పైగా మరణించినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాల్లో చెప్పారు. ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. ఈ దాడులు తామే చేసినట్లు అఫ్ఘాన్ తాలిబన్లు ప్రకటించుకున్నారు. అఫ్ఘానిస్థాన్ ప్రధాన నిఘా సంస్థ అయిన ఎన్‌డీఎస్ నుంచి సిబ్బందితో వెళ్తున్న మినీబస్సు లక్ష్యంగా ఈ దాడి జరిగింది. దాంతో 50 మందికి పైగా మరణించగా ఇంకా చాలామంది గాయపడ్డారని అంటున్నారు.
చాలా కాలం నుంచి ప్రశాంతంగా ఉంటున్న అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌లో ఉన్నట్టుండి జరిగిన ఈ దాడితో.. ఒక్కసారిగా కలకలం రేగింది. అందులోనూ బాగా రద్దీగా ఉండే ప్రాంతాన్నే ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. కార్మికులంతా ఇళ్లకు వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. దారుల్ అమన్ ప్రాంతంలో ఒక ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చేసుకున్నాడని అధికారులు చెప్పారు. అఫ్ఘానిస్థాన్ పార్లమెంటు భవన నిర్మాణానికి భారతదేశమే సాయం చేసిన విషయం తెలిసిందే. మొదటి పేలుడు జరిగిన తర్వాత కొద్దిసేపటికే మరో కారు బాంబు పేలింది.
Advertisement