ఏ మౌన్ కీ బాత్ క్యా హై మోదీ!
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో రోజురోజుకు వెలుగులోకి వస్తున్న కుంభకోణాలపై ప్రధాని నరేంద్రమోదీ నోరు విప్పకుండా మౌనం పాటించడం పట్ల ట్విట్టర్‌లో ఆయనపై చలోక్తులు, విమర్శలు కురిపిస్తున్నారు.
'ఏ మన్ కీ బాత్ నహీ, మౌన్ కా బాత్ క్యా హై బోలో! అని ఒకరు...మోదీని ఫాలో అవడం వల్ల వివిధ దేశాల జాతీయ దినోత్సవాలు, వివిధ రాజకీయ నాయకుల జన్మదినోత్సవాలు తెలుసుకున్నాను తప్ప మరేమీ లేదని మరొకరు. ఆయన ఎక్కడికెళ్లినా ఇచ్చే నివాళులు, వివిధ భాషల్లో ఇచ్చే ట్వీట్లు తప్ప ట్విట్టర్‌లో ఆయనను ఫాలో అవడం వల్ల నేను నేర్చుకున్నదేమీ లేదని ఇంకొకరు... మోదీ ఇచ్చే ట్వీట్లను రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి మనకు తెలిసిన విషయాలు. రెండోది మనం తెలసుకోవాల్సిన అవసరం లేని విషయాలు... మధ్య తరగతి ఓట్లతో గెలిచిన మోదీ ఇప్పుడు మధ్యతరగతికి చెందిన సమస్యల గురించి అసలే మాట్లాడడం లేదు. మన్‌కీ బాత్ కార్యక్రమం ద్వారా ఇతర వర్గాలను ఆకట్టుకునేందుకు అప్పుడే ఎన్నికల జిమ్మిక్కు ప్రారంభించారు' అంటూ ట్విట్టర్‌లో విమర్శలు కురిపిస్తున్నారు.
'అన్‌ఫాలో మోదీ... అన్‌ఫాలో మోదీ!... ఎంతైనా ప్రధానమంత్రి కదా అని ఇంతకాలం మోదీని ఫాలో అవుతూ వచ్చాను. ఇక సెలవు. వెనక్కి వెళ్లి ఇలా ఎంతోమందినే అన్‌ఫాలో కావాల్సి ఉంది అని... దేశంలో ఇంత జరుగుతున్నా ఆయన సొంత ఇమేజ్ పెంచుకోవడానికి, ప్రజా సంబంధాలను మెరుగు పర్చుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు అని.... క్లికిజమే ఆయన సిద్ధాంతమని... నేను ఈక్షణమే అన్‌ఫాలో అవుతున్నాను అని... ఆయనను నేనెందుకు ఫాలో అవుతున్నానో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఇప్పడే జ్ఞానోదయమయిందనే' విమర్శలతో పాటు కొన్ని తోటివారికి నచ్చజెప్పే ట్వీట్లు కూడా ఉన్నాయి.
అప్పుడే తొందరపడి విమర్శిస్తే ఎలా ! కాంగ్రెస్ ప్రభుత్వం 2004, 2009లో అధికారంలోకి వచ్చాక ఎన్నో కుంభకోణాలను చూశాం. వాటితో పోలిస్తే ఇప్పటి వరకు చూసినవే తక్కువే కదా అని ఒకరు... ఎన్ని కుంభకోణాలు వెలుగులోకి వచ్చినా సరే, దేశ ఆర్థిక వృద్ధి రేటు నాలుగు శాతం పడిపోయేవరకు మనం విమర్శలకు దిగకూడదని మరొకరు... మోదీపై ట్విట్టర్‌లో విమర్శలు చేసే బదులు నేరుగా లేఖ రాయవచ్చుగదా! అని ఇంకొకరి సలహా...
'నీ సలహా పాటిస్తే నాకు పోస్టులో కొన్ని గులాబీ పూలు. మోదీ సెల్ఫీ ఫొటో వస్తుంది' అంటూ ఓ విమర్శకుడి కొసమెరుపు. అయితే ఎవరెన్ని చెప్పినా.. మోదీకి మాత్రం ట్విట్టర్లో ఇప్పటికీ 1,35,26,072 మంది ఫాలోవర్లు ఉన్నారు.