సోషల్ మీడియా.. ఉతికి ఆరేస్తోంది!
వరదల్లో చిక్కుకున్న చెన్నై నగరంలో ఏరియల్ సర్వే చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటోను మార్ఫింగ్ చేసి అభాసుపాలైన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ), అందుకు క్షమాపణ చెప్పినా సోషల్ మీడియా శాంతించడం లేదు. ముఖ్యంగా ట్విట్టర్ యూజర్లు అదే ప్రధాని మోదీ ఫొటోను రకరకాలుగా మార్ఫింగ్ చేసి పోస్ట్ చేస్తూ వ్యంగ్యోక్తులు విసురుతున్నారు.
వాషింగ్ మిషన్‌లో ఉతకడానికి వేసిన బట్టలను మోదీ తదేకంగా చూస్తున్నట్టు, ఇండియా ఆడుతున్న క్రికెట్ మ్యాచ్ చూస్తున్నట్టు, తన ఉత్పత్తులను ప్రమోట్ చేసుకుంటున్న బాబా రాందేవ్ యాడ్‌ను చూస్తున్నట్టు, తన తరఫున రిపోర్టింగ్ చేస్తున్న అనుపమ్ ఖేర్‌ను చూస్తున్నట్టు, ఓ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తీరును గమనిస్తున్నట్టు, చెన్నైలో ఫొటో మార్ఫింగ్ ద్వారా వెలసిన అమ్మ బాహుబలి ఫొటోను తదేకంగా చూస్తున్నట్టు.. ఇలా ఒకటేమిటి.. ఎవరికి తోచినట్టు వారు ఫొటోను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేయడంలో పోటీ పడుతున్నారు. వాటికి సందోర్భోచిత వ్యాఖ్యానాలు కూడా చేస్తున్నారు.
చెన్నై నగరంలో వరద నష్టాన్ని అంచనా వేయడానికి గురువారం నగరానికి వచ్చిన ప్రధాని మోదీ సాయంత్రం ఐదు గంటల సమయంలో హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే చేసిన విషయం తెల్సిందే. మోదీ హెలికాప్టర్ విండో నుంచి నగరాన్ని చూస్తున్నప్పటికీ ఆకాశం మేఘావృతమై ఉండడంతో అందులో నుంచి ఏమీ కనిపించడం లేదు. ముందుగా ఇదే ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన పీఐబీ, విండో నుంచి నగర పరిస్థితి కనిపించడం లేదని భావించి, నగర పరిస్థితికి సంబంధించిన మరో ఫొటోను ఫొటోషాప్‌లో కట్ అండ్ పేస్ట్ ద్వారా అతికించింది. దాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేసి అంతకుముందు పోస్ట్ చేసిన అసలు ఫొటోను తొలగించింది. ఇంతలోనే ఈ విషయాన్ని గమనించిన సోషల్ మీడియా పీఐబీ చేసిన తప్పును ఉతికి ఆరేసింది. అలా చేసినందుకు తీవ్రంగా విచారిస్తున్నట్టు పీఐబీ వివరణ కూడా ఇచ్చింది. అయినా సరే, సోషల్ మీడియా కూడా మీడియానే కదా!