
సివిల్స్‌కు మరో రెండు చాన్స్‌లు
అవకాశాల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం
2014 ప్రిలిమ్స్ నుంచి అమల్లోకి
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్‌ను లక్ష్యంగా ఎంచుకున్న అభ్యర్థులందరికీ శుభవార్త. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏటా నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(సీఎస్‌ఈ)ను వారు మరో రెండు సార్లు అదనంగా రాయవచ్చు. అవసరమైతే, గరిష్ట వయోపరిమితి సడలింపులోనూ రెండేళ్లు అదనంగా లభిస్తాయి. 2014 ప్రిలిమ్స్ పరీక్ష నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల తనను కలిసిన సివిల్స్ అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
- డిగ్రీ ఉత్తీర్ణులైన 21 నుంచి 30 ఏళ్ల వయసున్న జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఇప్పటివరకు 4 సార్లు మాత్రమే సీఎస్‌ఈ రాసే అవకాశముండేది. తాజా నిర్ణయం ప్రకారం.. వారు 32 ఏళ్ల వయసులోపు 6 సార్లు ఆ పరీక్ష రాయవచ్చు.
- మూడేళ్ల గరిష్ట వయోపరిమితి సడలింపుతో ఇతర వెనకబడినవర్గాల వారు ఇప్పటివరకు 7 సార్లు సీఎస్‌ఈ రాసే వీలుంది. ఇకపై వారికి 9 సార్లు ప్రయత్నించే అవకాశం లభించింది. గరిష్ట వయోపరిమితిలోనూ వారికి రెండేళ్ల సడలింపు వర్తిస్తుంది.
- షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన అభ్యర్థులకు ఎన్నిసార్లైనా సీఎస్‌ఈ రాసే సౌలభ్యం ఉంది. ఇప్పటివరకు వారి గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు ఉంది. ఇకపై వారికీ గరిష్ట వయోపరిమితిలో మరో రెండేళ్ల సడలింపు లభిస్తుంది.
- ఇప్పటికే గరిష్ట వయోపరిమితి ముగిసిన లేదా అటెంప్ట్స్ అన్నీ పూర్తయినవారికి తాజా ప్రభుత్వ నిర్ణయం బాగా ఉపయోగకరం.
- గరిష్ట వయోపరిమితి సడలింపునకు సంబంధించి ప్రభుత్వం త్వరలో స్పష్టతనిస్తూ నిబంధనలను నోటిఫై చేయనుంది.
- ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్.. తదితర ప్రతిష్టాత్మక సర్వీసుల్లోకి ఈ పరీక్ష ద్వారా ఉద్యోగుల్ని ఎంపిక చేస్తారు.
- ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక జరుగుతుంది.
- అంధ, బధిర, మూగ, వికలాంగ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో పదేళ్ల సడలింపు ఉంది.