న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసేందుకు గతేడాదితోనే అవకాశాలు (అటెంప్ట్స్) పూర్తయిన అభ్యర్థులకు ఈ ఏడాది నుంచి మరో రెండు సార్లు పరీక్షలు రాసే అవకాశం లభించనుంది. అన్ని కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిని బట్టి ఈ ఏడాది నుంచి రెండు అదనపు అవకాశాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఈ మేరకు మంగళవారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సీ) వెల్లడించింది. పరీక్షల విధానం, సిలబస్‌లో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదని పేర్కొంది. సివిల్స్ పరీక్షలు రాసేందుకు జనరల్ అభ్యర్థులకు నాలుగు సార్లు, ఓబీసీలకు ఏడు సార్లు, ఎస్సీ, ఎస్టీలకు ఎన్నిసార్లు అయినా అవకాశం ఉంటుంది. అభ్యర్థులకు వయసు పరిమితి 21 నుంచి 30 ఏళ్ల వరకూ కాగా, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, వికలాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది. ఈ ఏడాది సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టు 24న జరగనుంది. సివిల్స్ పరీక్షల పూర్తి వివరాలను మే 31నాటి ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ లేదా రోజ్‌గార్ సమాచార్ పత్రికల సంచికలలో ప్రచురించనున్నట్లు యూపీఎస్‌సీ తెలిపింది.